నిద్రలో ఊహించని ప్రమాదం.. చావు అంచుల దాకా వెళ్లి.. ప్రాణాలతో బయటప‌డ్డాడు!

  • నిద్రలో 10వ అంతస్తు ఫ్లాట్ నుంచి జారిపడ్డ వ్యక్తి
  • 8వ అంతస్తు గ్రిల్‌లో కాలు ఇరుక్కుని ప్రాణాలతో బయటపడ్డ వైనం
  • గంటపాటు శ్రమించి కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
  • సూరత్‌లోని జహంగీర్‌పురాలో చోటుచేసుకున్న ఘటన
నిద్రలో అటుఇటు దొర్లుతూ ఓ వ్యక్తి 10వ అంతస్తులోని ఫ్లాట్ కిటికీ నుంచి కిందకు జారిపడ్డాడు. కానీ, అదృష్టం కొద్దీ రెండు అంతస్తుల కింద ఉన్న గ్రిల్‌లో కాలు ఇరుక్కుని ప్రాణాలతో బయటపడ్డాడు. సుమారు గంటపాటు నరకయాతన అనుభవించిన అతడిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ఈ అనూహ్య ఘటన సూరత్‌లోని జహంగీర్‌పురాలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది.

అస‌లేం జ‌రిగిందంటే..!
జహంగీర్‌పురాలోని టైమ్స్ గెలాక్సీ భవనంలో నివసించే నితిన్‌భాయ్ అదియా (57) బుధవారం ఉదయం 8 గంటల సమయంలో తన ఫ్లాట్‌లోని కిటికీ పక్కన నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ కిటికీలోంచి బయటకు జారిపోయాడు. అయితే, కింద ఉన్న 8వ అంతస్తు ఫ్లాట్ గ్రిల్‌లో ఆయన కాలు ఇరుక్కుపోయింది. దీంతో తలకిందులుగా వేలాడుతూ ఉండిపోయాడు.

ఇది గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు. జహంగీర్‌పురా, పాలన్‌పూర్, అదాజన్ ఫైర్ స్టేషన్ల నుంచి సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాడులు, సేఫ్టీ బెల్టుల సహాయంతో పై అంతస్తు నుంచి నితిన్‌భాయ్‌ను భద్రంగా పట్టుకుని, గ్రిల్‌లో ఇరుక్కున్న కాలును మెల్లగా బయటకు తీశారు. కింద భద్రత కోసం వల కూడా ఏర్పాటు చేశారు.

గంటపాటు శ్రమించిన సిబ్బంది, చివరకు అతడిని సురక్షితంగా లోపలికి లాగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం నితిన్‌భాయ్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. నితిన్‌భాయ్ తలకిందులుగా వేలాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


More Telugu News