Tarique Rahman: బంగ్లాదేశ్ చేరుకున్న తారిక్ రెహమాన్.. అధికారంలోకి వస్తే భారత్‌కు సానుకూలమేనా?

Tarique Rahman Reaches Bangladesh Will It Be Positive for India If He Comes to Power
  • వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో ఎన్నికలు
  • బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో సత్సంబంధాలు కోరుకుంటున్న భారత్
  • భారత్, పాక్‌కు సమదూరం పాటించాలని భావిస్తున్న రెహమాన్
  • పాక్‌కు దగ్గరగా, భారత్‌ను దూరంగా పెడుతున్న ప్రస్తుత యూనస్ ప్రభుత్వం
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) యాక్టింగ్ ఛైర్మన్ తారిఖ్ రెహమాన్ స్వదేశానికి తిరిగి వచ్చారు. సుమారు 17 ఏళ్ల పాటు లండన్ నుంచి పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించిన ఆయన, కుటుంబంతో కలిసి ఢాకాలో అడుగు పెట్టారు. ఆయన రాక నేపథ్యంలో ఢాకా విమానాశ్రయం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. తారిఖ్ రాకను ఆ పార్టీ కార్యకర్తలు సెకండ్ ఇన్నింగ్స్‌‍గా అభివర్ణిస్తున్నారు.

వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తే భారత్‌తో సంబంధాలు ఎలా ఉంటాయనే చర్చ జరుగుతోంది. షేక్ హసీనా నాయకత్వంలోని బంగ్లాదేశ్‌తో భారత్‌కు సత్సంబంధాలు ఉండేవి. ఆమె రాజీనామా చేశాక ఢిల్లీలోనే తలదాచుకున్నారు. కానీ తాత్కాలిక యూనస్ ప్రభుత్వంతో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బంగ్లాదేశ్ క్రమంగా పాకిస్థాన్‌కు దగ్గరవుతోంది.

త్వరలో జరగబోయే ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఆ పార్టీతో భారత్‌కు చెప్పుకోదగిన సంబంధాలు లేకపోయినప్పటికీ, దానిని భారత్ ఒక ప్రజాస్వామ్య పార్టీగా పరిగణిస్తోంది. ఆ పార్టీతో భారత్ సత్సంబంధాలు పునరుద్ధరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తారిఖ్ రెహమాన్ తల్లి ఖలీదా జియా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేయగా, దీనిని నేషనలిస్ట్ పార్టీ సానుకూలంగా స్వీకరించింది. అంతేకాదు, ప్రస్తుత యూనస్ ప్రభుత్వం విధానాలను రెహమాన్ వ్యతిరేకిస్తున్నారు. జమాత్-ఇ-ఇస్లామీతో పొత్తుకు కూడా రెహమాన్ సుముఖంగా లేరు.

జమాత్-ఇ-ఇస్లామీ పాకిస్థాన్ ఐఎస్ఐకి అనుకూలంగా వ్యవహరిస్తోందనే వాదనలు ఉన్నాయి. అందుకే షేక్ హసీనా హయంలో ఈ సంస్థపై నిషేధం విధించారు. యూనస్ ప్రభుత్వం వచ్చాక తిరిగి క్రియాశీలకంగా మారింది. భారత్, పాకిస్థాన్‌లకు రెహమాన్ సమదూరం పాటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. "ఢిల్లీ కాదు, రావల్పిండి కాదు, బంగ్లాదేశ్ తర్వాతే ఎవరైనా" అని తారిఖ్ రెహమాన్ అంటున్నారు. అయితే యూనస్ మాత్రం పాక్‌కు దగ్గరగా ఉంటూ, భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు.
Tarique Rahman
Bangladesh Nationalist Party
BNP
Bangladesh Elections
India Bangladesh relations

More Telugu News