Thummala Nageswara Rao: అప్పటి వరకు రైతు భరోసా నిధుల పంపిణీ ఉండదు: తుమ్మల నాగేశ్వరరావు
- యాసంగి పంట భూములను ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తిస్తామన్న తుమ్మల
- వాస్తవంగా సాగు చేస్తున్న భూములను గుర్తించి రైతులకు న్యాయం చేస్తామని వెల్లడి
- సాగు భూములను గుర్తించేంత వరకు నిధుల పంపిణీ ఉండదని స్పష్టీకరణ
రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో సాగవుతున్న పంట భూములను ఉపగ్రహ చిత్రాల ద్వారా ఖచ్చితంగా గుర్తించి, దాని ఆధారంగా రైతు భరోసా పథకం అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఉపగ్రహ చిత్రాల క్రోడీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ... యాసంగిలో వాస్తవంగా సాగు చేస్తున్న భూములనే గుర్తించి రైతులకు న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అందుకే ఉపగ్రహ చిత్రాల ఆధారంగా భూముల గుర్తింపు పూర్తయ్యే వరకు రైతు భరోసా నిధుల పంపిణీ ఉండదని తెలిపారు.
జనవరి నెలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని తిరిగి ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ యాంత్రీకరణ పథకానికి రాష్ట్ర వాటా నిధులు సమకూర్చి, రైతులకు రాయితీపై యంత్రాలు, పరికరాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు జనవరి మొదటి వారంలో మండలాల వారీగా పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయాలని మంత్రి సూచించారు. రైతులకు అందుతున్న రాయితీలు, యాంత్రీకరణ పథక దరఖాస్తులు, యూరియా యాప్ అమలు వంటి అంశాలపై ప్రత్యక్షంగా అభిప్రాయాలు సేకరించాలని చెప్పారు.
ప్రస్తుతం ఐదు జిల్లాల్లో యూరియా యాప్ విజయవంతంగా అమలవుతోందని మంత్రి తెలిపారు. త్వరలోనే ఈ యాప్ సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. అయితే, ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాల కారణంగా యాప్ అమలులో లేని జిల్లాల్లో కొంతమంది రైతులు అవసరానికి మించి యూరియా కొనుగోలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా యాప్ ద్వారా అవసరమైన మేరకే ఎరువులు కొనుగోలు చేయాలని, రైతులెవరూ అనవసర భయాందోళనలకు గురికావద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసమే ప్రతి నిర్ణయం తీసుకుంటోందని, ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు.