Rohit Sharma: రోహిత్ భాయ్ వడాపావ్ తింటావా?.. విజయ్ హజారే మ్యాచ్​లో ఫన్నీ మూమెంట్.. ఇదిగో వీడియో!

Rohit Sharma Hilarious Vadapav Exchange During Vijay Hazare Trophy
  • విజయ్ హజారే ట్రోఫీలో సిక్కిం-ముంబై మ్యాచ్‌లో స‌ర‌దా సంఘ‌ట‌న‌
  • అభిమానితో రోహిత్‌ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్
  • వడా పావ్ తింటావా అని అడగ్గా వద్దంటూ హిట్‌మ్యాన్‌ సైగ
  • రోహిత్ మెరుపులతో సిక్కింపై ముంబై ఘన విజయం
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ సరదా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ముంబై, సిక్కిం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా స్టాండ్స్‌లోని ఓ అభిమాని రోహిత్‌ను ఉద్దేశించి "రోహిత్ భాయ్ వడా పావ్ తింటావా?" అని గట్టిగా అడిగాడు. దీనికి రోహిత్ నవ్వుతూ వద్దంటూ చేతితో సైగ చేశాడు. ఈ దృశ్యం కెమెరాలో రికార్డ్ అవ్వడం, అది కాస్తా బ‌య‌ట‌కు రావ‌డంతో కొద్దిసేపటికే నెట్టింట‌ వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, చాలా కాలం తర్వాత లిస్ట్-ఏ క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన రోహిత్ శర్మ తనదైన శైలిలో విధ్వంసక సెంచరీతో చెలరేగాడు. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సిక్కిం బౌలింగ్‌ను ఉతికారేశాడు. కేవలం 94 బంతుల్లో 18 ఫోర్లు, 9 భారీ సిక్సర్ల సాయంతో 155 పరుగులు సాధించి అభిమానులను అలరించాడు.

రోహిత్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా సిక్కిం నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు కేవలం 30.3 ఓవర్లలోనే ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు సుమారు 20,000 మంది అభిమానులు హాజరయ్యారు. రోహిత్ అద్భుత ప్రదర్శనతో పాటు అభిమానితో అతని సరదా సంభాషణ కూడా అందరినీ ఆకట్టుకుంది.


Rohit Sharma
Rohit Sharma Vadapav
Vijay Hazare Trophy
Mumbai Cricket
Sikkim Cricket
Cricket Funny Moments
Savai Mansingh Stadium
Rohit Sharma Century
List A Cricket

More Telugu News