Vishnu Idol: సరిహద్దులో విష్ణుమూర్తి విగ్రహం కూల్చివేత.. థాయ్-కంబోడియా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత

 Lord Vishnu Statue Destroyed In Cambodia Allegedly By Thailand
  • వివాదాస్పద సరిహద్దులో విష్ణు విగ్రహం ధ్వంసం
  • ఇది థాయిలాండ్ పనేనంటూ కంబోడియా ఆరోపణ
  • విగ్రహాన్ని కూల్చివేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్
థాయిలాండ్, కంబోడియా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతుండగానే ఒక కొత్త వివాదం రాజుకుంది. తమ భూభాగంలోని విష్ణుమూర్తి విగ్రహాన్ని థాయిలాండ్ ధ్వంసం చేసిందని కంబోడియా తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అంశం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

ఏఎఫ్‌పీ వార్తా సంస్థ కథనం ప్రకారం వివాదాస్పద అన్ సెస్ ప్రాంతంలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని థాయిలాండ్ కూల్చివేసిందని కంబోడియాలోని ప్రీ విహార్ ప్రతినిధి లిమ్ చన్‌పన్హా ఆరోపించారు. 2014లో నిర్మించిన ఈ విగ్రహం కంబోడియా భూభాగంలోనే ఉందని, థాయిలాండ్ సరిహద్దుకు కేవలం 100 మీటర్ల దూరంలో సోమవారం ఈ ధ్వంసం జరిగిందని ఆయన వివరించారు. "హిందువులు, బౌద్ధులు పూజించే పురాతన ఆలయాలు, విగ్రహాలను కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం" అని ఆయన అన్నారు.

విగ్రహాన్ని బుల్డోజర్ (బ్యాక్‌హో లోడర్) తో కూల్చివేస్తున్న దృశ్యాలున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఈ వీడియోను కృత్రిమ మేధస్సు (AI) తో ఎడిట్ చేయ‌లేదని ఏఎఫ్‌పీ తన నివేదికలో పేర్కొంది. ఈ ఆరోపణలపై థాయిలాండ్ అధికారులు ఇంకా స్పందించలేదు. ఘటనపై భారత్ కూడా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదని బ్యాంకాక్‌లోని భారత రాయబార కార్యాలయ వర్గాలు తెలిపాయి.

మరోవైపు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించడంపై సైనిక అధికారులు చర్చలు ప్రారంభించారు. గత 16 రోజులుగా జరిగిన భీకర ఘర్షణల్లో 86 మంది మరణించిన నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Vishnu Idol
Thailand
Cambodia
Border Dispute
Preah Vihear
An Ses Area
India
Hindu Temple
Demolition
International Relations

More Telugu News