Air India Express: నవీ ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి సర్వీసులు ప్రారంభించిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్

Air India Express Begins Operations at Navi Mumbai International Airport
  • నవీ ముంబై కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం
  • క్రిస్మస్ రోజున సేవలు మొదలుపెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్
  • తొలి విమాన సర్వీసులు బెంగళూరు, ఢిల్లీ నగరాలకు
  • ఇండిగో, ఆకాశ ఎయిర్ కూడా సేవలు అందిస్తున్నట్టు ప్రకటన
  • మొదట 12 గంటల పాటు పనిచేయనున్న విమానాశ్రయం
నవీ ముంబైలో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) ఇవాళ‌ క్రిస్మస్ పర్వదినం రోజున ప్రారంభమైంది. ఈ విమానాశ్రయం నుంచి కార్యకలాపాలు ప్రారంభించిన తొలి సంస్థల్లో ఒకటిగా నిలిచిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్.. బెంగళూరు, ఢిల్లీ నగరాలకు నేరుగా విమాన సర్వీసులను మొదలుపెట్టింది.

నవీ ముంబై విమానాశ్రయం నుంచి ఎగిరిన తొలి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం బెంగళూరుకు చేరుకుంది. దీని తర్వాత ఢిల్లీకి వెళ్లే విమానం మధ్యాహ్నం 2:05 గంటలకు నవీ ముంబై నుంచి బయలుదేరి, సాయంత్రం 4:20 గంటలకు దేశ రాజధానికి చేరుకుంటుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలోక్ సింగ్ మాట్లాడుతూ.. "నవీ ముంబై నుంచి విమాన సేవలు ప్రారంభించడం ఒక మైలురాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌కు కనెక్టివిటీని పెంచడంలో మేం భాగస్వాములం కావడం సంతోషంగా ఉంది. మా డ్యూయల్-ఎయిర్‌పోర్ట్ వ్యూహంలో నవీ ముంబై ఒక కీలకమైన భాగం" అని వివరించారు. భవిష్యత్తులో తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తామని ఆయన తెలిపారు.

భారత్‌లో కొత్తగా నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లలో ఎన్ఎమ్ఐఏ ఒకటి. తొలి నెలలో ఈ విమానాశ్రయం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు (12 గంటలు) మాత్రమే పనిచేస్తుంది. ఈ సమయంలో రోజుకు 23 విమానాలు రాకపోకలు సాగిస్తాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఇండిగో, ఆకాశ ఎయిర్ కూడా 16 ప్రధాన దేశీయ నగరాలకు సేవలు అందిస్తాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, 2026 ఫిబ్రవరి నుంచి విమానాశ్రయాన్ని 24 గంటల పాటు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్‌కు చెందిన ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (74 శాతం వాటా), మహారాష్ట్ర ప్రభుత్వ సిడ్కో (26 శాతం వాటా) పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు.
Air India Express
Navi Mumbai International Airport
NMIA
Mumbai Airport
Air India
Flights to Bangalore
Flights to Delhi
Aloke Singh
Adani Airports
Indigo Airlines

More Telugu News