Sleeping Pods: రైల్వే స్టేషన్లలో విమానాశ్రయ స్థాయి వసతి.. సామాన్యుడికి అందుబాటులో ‘స్లీపింగ్ పాడ్స్’

Indian Railways Introduces Sleeping Pods at Guntur Station
  • మరింత సౌకర్యవంతంగా మారనున్న రైల్వే ప్రయాణం
  • ఇప్పటికే చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో అందుబాటులోకి
  • తాజాగా గుంటూరు రైల్వే స్టేషన్‌లోనూ ప్రారంభం
  • రెండు గంటల విశ్రాంతికి రూ. 200 చెల్లిస్తే సరి
రైల్వే ప్రయాణికుల అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు దక్షిణ మధ్య రైల్వే సరికొత్త హంగులు అద్దుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు లేదా రైళ్ల కోసం గంటల తరబడి వేచి చూసే ప్రయాణికుల అలసట తీర్చేందుకు అత్యాధునిక 'స్లీపింగ్ పాడ్స్' సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే చర్లపల్లి రైల్వే టెర్మినల్‌లో విజయవంతంగా కొనసాగుతున్న ఈ హైటెక్ బస సదుపాయాన్ని తాజాగా గుంటూరు రైల్వే స్టేషన్‌లోనూ ప్రారంభించారు. విమానాశ్రయాల్లో ఉండే ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లను తలపించేలా ఉన్న ఈ స్లీపింగ్ పాడ్స్, అతి తక్కువ ధరలోనే విలాసవంతమైన విశ్రాంతిని అందిస్తున్నాయి.

చర్లపల్లి టెర్మినల్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో మొత్తం 32 సింగిల్ బెడ్లను సిద్ధం చేశారు. వీటిలో మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా 16 చొప్పున కేటాయించడం విశేషం. రెండు గంటల విశ్రాంతి కోసం రూ. 200 చెల్లిస్తే సరిపోతుంది. ఆరు గంటలకు రూ. 400, 12 గంటలకు రూ. 800, పూర్తి రోజు బస చేయాలనుకునే వారికి రూ. 1,200గా ధరలను నిర్ణయించారు. హోటల్ గదుల కోసం స్టేషన్ బయటకు వెళ్లి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా, ప్రయాణికుల రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఈ స్లీపింగ్ పాడ్స్‌లో బస చేసే వారికి కేవలం పడక మాత్రమే కాకుండా.. ఉచిత హైస్పీడ్ వైఫై, 24 గంటల పాటు వేడి నీటి సరఫరా, లగేజీ భద్రత కోసం ప్రత్యేక లాకర్లు, పరిశుభ్రమైన వాష్ రూమ్స్ వంటి సౌకర్యాలు కల్పించారు. వీటితో పాటు స్నాక్స్ బార్, ట్రావెల్ డెస్క్ వంటి అదనపు సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. తొలుత ముంబై స్టేషన్‌లో ప్రారంభించిన ఈ విధానానికి అనూహ్య స్పందన రావడంతో, ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రధాన స్టేషన్లకు దీనిని విస్తరిస్తున్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే ఉన్నతాధికారులు కోరుతున్నారు.
Sleeping Pods
Indian Railways
South Central Railway
Charlapalli Terminal
Guntur Railway Station
Railway Station Facilities
Budget Accommodation
Travel
Airport Style
Railway Passengers

More Telugu News