20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: సీఎం చంద్రబాబు

  • స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • 20 లక్షల ఉద్యోగాల కల్పనే మొదటి ప్రాధాన్యత అని స్పష్టీక‌ర‌ణ‌
  • పది సూత్రాలను పది మిషన్లుగా అమలు చేయాలని అధికారులకు ఆదేశం
  • నీటి భద్రత, వ్యవసాయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన
  • 'మేడ్ ఇన్ ఆంధ్ర' బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తం చేయాలని దిశానిర్దేశం
స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధన కోసం రూపొందించిన పది సూత్రాలను పది మిషన్లుగా స్వీకరించి పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. పాలనలో వేగాన్ని పెంచి, ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు ప్రతి ప్రభుత్వ శాఖ పనితీరును తెలిపే ప్రత్యేక సూచికలను (ఇండికేటర్లు) సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. సచివాలయంలో ఇవాళ‌ ఆయన స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు, పది సూత్రాల అమలుపై నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే అత్యంత ప్రాధాన్యతాంశమని స్పష్టం చేశారు. నైపుణ్యం పోర్టల్ ద్వారా ఉద్యోగాల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని సూచించారు. జీరో పావర్టీ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలోని 30 లక్షల పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా కలిగే ప్రయోజనాన్ని అంచనా వేయాలని, ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు.

నీటి భద్రతను కీలక మిషన్‌గా పరిగణించి, నీటి వనరుల సమర్థ వినియోగంపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు తెలిపారు. నీటి ఆడిట్ నిర్వహించాలని, వివాదాలకు తావులేకుండా చూడాలని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యల నివారణకు పటిష్టమైన కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.

'మేడ్ ఇన్ ఆంధ్ర' బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించాలని, అరకు కాఫీ తరహాలో రాష్ట్ర ఉత్పత్తులకు నాణ్యతతో కూడిన గుర్తింపు తీసుకురావాలని సీఎం సూచించారు. రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు లాజిస్టిక్స్ మాస్టర్ ప్లాన్, స్వచ్ఛాంధ్ర కోసం సర్క్యులర్ ఎకానమీ, సాంకేతికత వినియోగంతో పౌర సేవలను సులభతరం చేయడం వంటి అంశాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


More Telugu News