ACB Raids: విశాఖ ఆఫీస్ అటెండర్‌కు రూ. కోటి ఆస్తులు.. ఏసీబీ సోదాల్లో షాకింగ్ నిజాలు

ACB Raids Expose Crores Worth Assets at Visakhapatnam Attender Anand Kumars Residence
  • అటెండర్ ఇంట్లో రూ. కోటి విలువైన స్థిర, చరాస్తుల గుర్తింపు
  • సూపర్‌బజార్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ సోదాల్లో బ‌య‌ట‌ప‌డ్డ ఆస్తులు
  • జూనియర్ అసిస్టెంట్, సబ్‌రిజిస్ట్రార్ ఇళ్లలో కీలక పత్రాల స్వాధీనం
విశాఖపట్నం జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఎంత లోతుగా పాతుకుపోయిందో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) సోదాల్లో బ‌య‌ట‌ప‌డుతోంది. నవంబర్ నెలలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేపట్టిన తనిఖీల దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దర్యాప్తులో భాగంగా నిన్న‌ ఏసీబీ అధికారులు పలువురు ఉద్యోగుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు.

సూపర్‌బజార్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న ఆనంద్‌కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సుమారు రూ. కోటి విలువైన స్థిర, చరాస్తులను గుర్తించి షాక్‌కు గురయ్యారు. ఒక అటెండర్ స్థాయిలో పనిచేసే వ్యక్తి ఇంత భారీ ఆస్తులు ఎలా కూడబెట్టాడనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అదే కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సుధారాణి నివాసంలోనూ దాదాపు కోటి రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు గుర్తించారు.

ఇక సబ్‌రిజిస్ట్రార్ మోహనరావు నివాసంలోనూ స్థిరాస్తులు, చరాస్తులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో నగదు, బంగారు ఆభరణాలు, రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన పత్రాలు లభించడంతో అధికారులు దర్యాప్తును మరింత విస్తృతం చేశారు.

ముందుగా నవంబర్ 5న సూపర్‌బజార్ కార్యాలయంతో పాటు పెదగంట్యాడ, మధురవాడ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఏసీబీ అధికారులు, లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల పాటు కీలక డాక్యుమెంట్లను పరిశీలించిన అనంతరం, మంగళవారం ఒకేసారి నాలుగు చోట్ల సిబ్బంది ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఈ దాడులు ప్రభుత్వ కార్యాలయాల్లోని అవినీతిని బయటపెట్టడంలో కీలకంగా మారాయి.

ఈ కేసులో మరిన్ని కీలక నిజాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అవినీతి నిర్మూలన దిశగా ఏసీబీ దర్యాప్తు మరింత కఠినంగా కొనసాగనుంది.
ACB Raids
Anand Kumar
Visakhapatnam ACB
Corruption Andhra Pradesh
Sub Registrar Office
Illegal Assets
Sudha Rani
Mohan Rao
Visakha News
Andhra Pradesh News

More Telugu News