Sivaji Raja: హీరోయిన్ల దుస్తుల విషయంలో నా మాటలకు కట్టుబడి ఉన్నా, కానీ: సినీ నటుడు శివాజీ

Sivaji Raja Stands by Heroine Outfit Comments Apologizes for Abusive Words
  • ఈవెంట్ తర్వాత బయటకు రాగానే చేసిన తప్పును గ్రహించానన్న శివాజీ
  • రెండు అసభ్య పదాలను వాడినందుకు మాత్రం క్షమాపణ కోరుతున్నానన్న శివాజీ
  • నా తోటి నటీనటులు, ఆడబిడ్డలకు క్షమాపణ చెబుతున్నానన్న శివాజీ
హీరోయిన్ల దుస్తుల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, అయితే ఆ సందర్భంలో రెండు అసభ్య పదాలను వాడినందుకు మాత్రం క్షమాపణ కోరుతున్నానని ప్రముఖ సినీ నటుడు శివాజీ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో స్పందించారు. ఆ రోజు కార్యక్రమం నుంచి బయటకు రాగానే తాను చేసిన తప్పును గ్రహించానని అన్నారు.

ఆ రోజు తనతో పాటు వేదికపై ఉన్న నా తోటి నటీనటులు, ఆడబిడ్డలకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. తన నుంచి అలాంటి వ్యాఖ్యలు దొర్లకూడదని ఆయన అన్నారు. తాను రాజకీయాల్లో కూడా ఏ రోజూ ఎవరినీ చిన్నమాట కూడా అనలేదని, హద్దుమీరి కూడా మాట్లాడలేదని వ్యాఖ్యానించారు. ఈవెంట్‌లో ఎందుకు అలా మాట్లాడానా అని బాధపడ్డానని పేర్కొన్నారు. బయటకు రాగానే తాను పొరపాటును గ్రహించానని, ఆ పదాలు వాడినందుకు మాత్రం క్షమాపణ చెబుతున్నానని అన్నారు.

అయితే దుస్తుల విషయంలో తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు మాత్రం కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఎవరికీ భయపడే పని లేదన్నారు. ఆ రెండు పదాల విషయంలో మాత్రమే తాను తప్పును అంగీకరిస్తున్నానని అన్నారు. రాజకీయాల్లో కూడా తప్పు మాట్లాడని నేను ఆ రోజు ఎందుకు మాట్లాడానా అని 36 గంటలుగా నిద్రపోలేదని అన్నారు. అందుకే సినిమా ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదని తెలిపారు.

ఆ రోజు జరిగిన ఘటనపై ప్రెస్ మీట్ పెడతానని తాను నిర్మాతకు చెప్పానని, ఎందుకులేండీ, వివాదమవుతుందేమోనన్నారని కానీ, సినిమాకు డబ్బులు తీసుకున్నందుకు తనకూ ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉంటుందని అన్నారు. ఈ సినిమాను ప్రేక్షకులు తప్పకుండా థియేటర్‌లోనే చూడాలని విజ్ఞప్తి చేశారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న కుల వ్యవస్థను సృశిస్తూ ఈ సినిమా 'దండోరా' రూపొందిందన్నారు.

తెలుగు జాతి సంస్కృతిని ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి గారు సహా ఎంతోమంది తమ మాటల్లో స్త్రీ ప్రాముఖ్యత గురించి చెబుతున్నారని గుర్తు చేశారు. సినిమాల్లో ఎలా చేసినప్పటికీ హీరోయిన్లు బయటకు వచ్చినప్పుడు మాత్రం చక్కగా ఉండాలని సూచించారు. లులు మాల్‌లో నిధి అగర్వాల్ పడిన ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని తాను అలా మాట్లాడానని అన్నారు. ఆమె పడిన ఇబ్బందిని చూశానని అన్నారు. 

ఒకప్పుడు రమ్యకృష్ణ, జయసుధ, విజయశాంతి కట్టుకున్న చీరలు వాళ్ల పేరుతోనే విక్రయాలు జరిగేవని అన్నారు. ఫలానా దుస్తులు మాత్రమే వేసుకోవాలని తాను ఎవరికీ చెప్పడం లేదని అన్నారు. సమాజంలో ఏ రుగ్మత వచ్చినా, సినిమాల వల్లే చెడిపోతున్నారని అంటారని, సినిమా వల్లే ఈ ప్రపంచం నాశనమవుతుందనే మాటలు వింటూ ఉన్నామని అన్నారు. ఈ సినిమా ద్వారానే తన కుటుంబం బతుకుతోందని, అలాంటి సినిమాను ఎవరూ అనకూడదనే ఉద్దేశంతోనే అలా మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు.
Sivaji Raja
Dandora Movie
Heroine outfits
Telugu cinema
Nidhi Agarwal
Samantha
Lulu Mall incident

More Telugu News