Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టిన రోహిత్ శర్మ.. సిక్కింపై ముంబై విజయం

Rohit Sharma Shines in Vijay Hazare Trophy Mumbai Wins Against Sikkim
  • ఎనిమిది వికెట్ల తేడాతో ముంబై విజయం
  • 237 పరుగుల లక్ష్యాన్ని 30 ఓవర్లలో ఛేదించిన ముంబై
  • 94 బంతుల్లో 155 పరుగులు చేసిన రోహిత్ శర్మ
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జైపూర్ వేదికగా సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఆటగాడు రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సిక్కిం నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై 30 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 237 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.

రోహిత్ శర్మ 94 బంతుల్లో 155 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడు తన ఇన్నింగ్స్‌లో 18 ఫోర్లు, 9 సిక్సులు బాదాడు. ముంబై కెప్టెన్ శార్దూల్ పటేల్ రెండు వికెట్లు తీశాడు. రోహిత్‌తో కలిసి అంగ్‌క్రిష్ రఘువంశీ 38 పరుగులు చేసి జట్టు విజయంలో సహకరించాడు. ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్ సోదరులు ముంబైని విజయతీరాలకు చేర్చారు.

సిక్కిం బ్యాటర్లలో ఆశిష్ (87 బంతుల్లో 8 ఫోర్లుతో 79 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కె.సాయి సాత్విక్ (34), క్రాంతి కుమార్ (34), రాబిన్ లింబో (31 నాటౌట్)లు తమవంతు సహకారం అందించారు. రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ప్రేక్షకులు 'ముంబై రాజా' అంటూ నినాదాలు చేశారు. రోహిత్ శర్మను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
Rohit Sharma
Vijay Hazare Trophy
Mumbai
Sikkim
Cricket
Shardul Patel

More Telugu News