ISRO: ఆకాశమే హద్దు: ఇస్రో 'బాహుబలి' ఘనవిజయం!

ISRO Bahubali Rocket Successful Launch of BlueBird 6
  • నింగిలోకి అతిపెద్ద కమ్యూనికేషన్ శాటిలైట్
  • అంతరిక్షం నుంచి నేరుగా మొబైల్‌కు ఇంటర్నెట్
  • ఢీకొనే ముప్పు తప్పించేందుకు 90 సెకన్ల పాటు నిలిపివేత
  • తర్వాత విజయవంతంగా ప్రయోగం 
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అధిగమించింది. తన అత్యంత శక్తిమంతమైన 'బాహుబలి' రాకెట్ LVM3-M6 ద్వారా అమెరికాకు చెందిన 'బ్లూబర్డ్ 6' (BlueBird 6) ఉపగ్రహాన్ని బుధవారం విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి జరిగిన ఈ ప్రయోగం భారతీయ అంతరిక్ష రంగ చరిత్రలో అతిపెద్ద వాణిజ్య విజయంగా నిలిచిపోయింది.

ఉదయం 8:55 గంటలకు రెండో లాంచ్ ప్యాడ్ నుంచి 43.5 మీటర్ల ఎత్తున్న ఎల్వీఎం3 రాకెట్ గంభీరంగా నింగిలోకి ఎగిసింది. ప్రయాణం మొదలైన 15 నిమిషాలకే లక్ష్యానికి చేరుకుని, భూమికి 520 కిలోమీటర్ల ఎత్తులో ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. 6,100 కిలోల బరువున్న ఈ బ్లూబర్డ్ ఉపగ్రహం భారత గడ్డపై నుండి ప్రయోగించిన అత్యంత భారీ ఉపగ్రహంగా రికార్డు సృష్టించింది.

అమెరికాకు చెందిన 'ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్' రూపొందించిన ఈ ఉపగ్రహం ప్రత్యేకత ఏంటంటే.. దీనివల్ల ఎలాంటి అదనపు పరికరాలు లేకుండానే సాధారణ స్మార్ట్‌ఫోన్లకు నేరుగా అంతరిక్షం నుంచి 4G/5G బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుతాయి. ఈ ప్రయోగంలో ఒక ఆసక్తికరమైన మలుపు చోటుచేసుకుంది. ముందుగా ఉదయం 8:54 గంటలకే రాకెట్ బయలుదేరాల్సి ఉంది. కానీ రాకెట్ వెళ్లే మార్గంలో అంతరిక్ష వ్యర్థాలు, లేదా ఇతర ఉపగ్రహాలు ఢీకొనే ప్రమాదం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన ఇస్రో, కచ్చితమైన సమయ పాలనతో ప్రయోగాన్ని 90 సెకన్ల పాటు ఆలస్యం చేసి, 8:55 గంటల 30 సెకన్లకు ప్రయోగించింది. తద్వారా పెను ప్రమాదాన్ని నివారించి విజయాన్ని అందుకుంది.

ప్రయోగం విజయవంతమైన తర్వాత ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ మాట్లాడుతూ.. "ఎల్వీఎం3 రాకెట్ తన అద్భుతమైన ట్రాక్ రికార్డును మరోసారి నిరూపించుకుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ రాకెట్లలో ఇదొకటని నిరూపితమైంది" అని సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఇస్రో చేపట్టిన మూడవ పూర్తి స్థాయి వాణిజ్య మిషన్ కావడం విశేషం.
ISRO
LVM3-M6
BlueBird 6
Indian Space Research Organisation
Sriharikota
AST SpaceMobile
V Narayanan
Commercial Mission
Space Technology
Satellite Launch

More Telugu News