Karate Kalyani: ఆయ‌న ఉద్దేశం వేరు.. శివాజీ వ్యాఖ్యలపై కరాటే కల్యాణి షాకింగ్ కామెంట్స్‌!

Karate Kalyani defends Sivajis comments on heroines dressing
  • హీరోయిన్ల దుస్తులపై శివాజీ వ్యాఖ్యలను సమర్థించిన కరాటే కల్యాణి
  • మాటల తీరు తప్పైనా ఉద్దేశం తప్పుకాదన్న సినీనటి
  • ఇండస్ట్రీలో ఉన్నవారు రోల్ మోడల్స్ గా ఉండాలని సూచన
హీరోయిన్లు వేసుకునే దుస్తులపై సినీనటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారిన నేపథ్యంలో ఈ అంశంపై సినీనటి కరాటే కల్యాణి స్పందించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, శివాజీ వ్యాఖ్యలను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. శివాజీ మాటల తీరు తప్పుగా అనిపించవచ్చని అంగీకరిస్తూనే, ఆయన ఉద్దేశాన్ని మాత్రం తప్పుగా అర్థం చేసుకుంటున్నారని కరాటే కల్యాణి అభిప్రాయపడ్డారు.

“నేను శివాజీని సమర్థిస్తాను. భారతదేశంలో స్త్రీలకు ఎంతో ఔన్నత్యం ఉంది. కట్టు, బొట్టు మన సంస్కృతి. భారతీయ మహిళ అంటే ప్రపంచం మొత్తం గౌరవంగా చూస్తుంది. శివాజీ చెప్పిన విధానంలో కొంత తేడా ఉండొచ్చు కానీ ఆయన భావన మాత్రం తప్పు కాదు” అని ఆమె వ్యాఖ్యానించారు. శివాజీ మాట్లాడిన ఒకే ఒక్క మాటను తీసుకుని పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇక గతంలో పాటల్లో వాడిన పదాల అంశాన్ని ప్రస్తావిస్తూ, “చికిరి చికిరి పాటలో కూడా ఇలాంటి పదాలే వాడారు. అప్పుడు వాటిపై ఎందుకు ఎవరూ స్పందించలేదు? చిన్మయి ఎందుకు అప్పుడే ప్రశ్నించలేదు?” అంటూ ఆమె నిల‌దీశారు. 

డ్రెస్సింగ్ విషయంలో మరింత ఘాటుగా స్పందించిన కరాటే కల్యాణి, అనసూయ తన కుమారుడి ఒడుగు కార్యక్రమంలో సంప్రదాయ పట్టు చీర కట్టుకోవడాన్ని ఉదాహరణగా చూపించారు. “అవసరమైనప్పుడు సంప్రదాయాలను గుర్తు చేసుకుంటారు. అంటే సంప్రదాయం విలువ వారికి తెలుసు” అని వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీలో ఎదిగినవారు సమాజానికి రోల్ మోడల్‌గా ఉండాలని, అర్ధనగ్న ప్రదర్శనలు చేయకుండానే చీరలు కట్టుకుని అందంగా కనిపించవచ్చని చెప్పారు.

ఇటీవల హీరోయిన్ నిధి అగర్వాల్ దుస్తులపై తాను చేసిన పోస్టును ప్రస్తావిస్తూ, సమాజంలో వస్తున్న మార్పులు, యువతలో పెరుగుతున్న అలవాట్లపై ఆందోళన వ్యక్తం చేశారు. కరాటే కల్యాణి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, సంప్రదాయం-వ్యక్తిగత స్వేచ్ఛ అంశంపై మరోసారి చర్చకు తెరలేపాయి.
Karate Kalyani
Sivaji
actress comments
Telugu cinema
Anasuya Bharadwaj
Nidhi Agarwal
Tollywood
cultural values
dress code
Indian culture

More Telugu News