Veeransh Bhanushali: ఆక్స్‌ఫర్డ్ వేదికగా పాకిస్థాన్‌కు 'సర్జికల్ స్ట్రైక్'.. ముంబై యువకుడి దెబ్బకు దాయాది విలవిల

Veeransh Bhanushali Surgical Strike on Pakistan at Oxford
  • ఆక్స్‌ఫర్డ్ యూనియన్ చర్చా వేదిక
  • పాక్‌ను చీల్చి చెండాడిన వీరాంశ్ భానుశాని
  • పాక్‌ను ఓడించేందుకు ఆర్భాటపు మాటలు అవసరం లేదని స్పష్టీకరణ
  • ఒక్క క్యాలెండర్ ఉంటే పాక్‌ను ఓడించవచ్చన్న వీరాంశ్ 
  • చర్చను అడ్డుకోవాలని చూసిన పాక్ రక్షణమంత్రి కుమారుడు
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనియన్ చర్చా వేదికగా భారత్-పాక్ మధ్య జరిగిన వాదోపవాదాలలో ఒక భారతీయ విద్యార్థి పాకిస్థాన్ తీరును చీల్చి చెండాడారు. ముంబైకి చెందిన వీరాంశ్ భానుశాలి అనే లా విద్యార్థి, పాకిస్థాన్ ప్రాయోజిత ఉగ్రవాదంపై చేసిన ప్రసంగం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.

నిజానికి ఈ చర్చా కార్యక్రమం చుట్టూ పెద్ద వివాదమే నడిచింది. ఆక్స్‌ఫర్డ్ యూనియన్ ప్రెసిడెంట్ మూసా హర్రాజ్ (పాక్ రక్షణ శాఖ మంత్రి కుమారుడు), భారత ప్రతినిధులకు ఆహ్వానాలు అందకుండా చేసి, భారత్ తప్పుకుందని తప్పుడు ప్రచారం చేశారు. అయితే, విద్యార్థుల స్థాయిలో జరిగిన చర్చలో వీరాంశ్ భానుశాలి పాక్ బృందాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు.

ముంబై దాడుల వార్షిక దినమైన నవంబర్ 26 మరుసటి రోజే ఈ చర్చ జరగడం విశేషం. 2008లో ముంబై ఉగ్రదాడి జరిగినప్పుడు తన వయస్సు చాలా తక్కువని, తన ఇంటికి కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్న సీఎస్‌ఎంటీ స్టేషన్‌లో జరిగిన మారణకాండను కళ్లారా చూశానని వీరాంశ్ భావోద్వేగంగా చెప్పారు. "సిగ్గు లేని దేశాన్ని మనం ఎప్పటికీ సిగ్గుపడేలా చేయలేము. భారత్ తన ఆత్మరక్షణ కోసం తీసుకునే చర్యలు 'పాప్యులిజం' (ప్రజాకర్షక రాజకీయాలు) కాదు.. అది బాధ్యత" అని ఆయన స్పష్టం చేశారు.

పాకిస్థాన్‌ను ఓడించడానికి తనకు ఎలాంటి ఆర్భాటపు మాటలు అవసరం లేదని, కేవలం ఒక 'క్యాలెండర్' ఉంటే చాలని వీరాంశ్ ఎద్దేవా చేశారు. 1993 పేలుళ్ల సమయంలో ఎన్నికలు లేవు, కానీ పాక్ ఐఎస్ఐ ముంబైని రక్తపాతం చేసింది. 26/11 తర్వాత భారత్ ఎంతో ఓపిక పట్టిందని, కానీ ఆ శాంతి కాముకత మనకు పఠాన్‌కోట్, ఉరి, పుల్వామా దాడులను మిగిల్చిందని దుయ్యబట్టారు.

ఇటీవల జరిగిన సైనిక చర్య ఎన్నికల కోసం కాదని, అమాయక పర్యాటకులను చంపిన ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడానికేనని ఆయన వివరించారు. పాకిస్థాన్ అంతర్గత పరిస్థితులపై వీరాంశ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. "మీ దేశ ప్రజలకు రొట్టెలు (ఆహారం) ఇవ్వలేరు, అందుకే వారికి యుద్ధం అనే సర్కస్‌ను చూపిస్తున్నారు. పేదరికాన్ని అధికారంగా మార్చుకోవడానికి యుద్ధ భయాన్ని వాడుకుంటున్నారు" అని పాక్ ప్రతినిధి మూసా హర్రాజ్ ముందే ఆయన కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పారు.

"మేము ఉల్లిపాయలు, విద్యుత్ వ్యాపారం చేసుకునే మంచి పొరుగువారిగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ మీరు ఉగ్రవాదాన్ని విదేశాంగ విధానంగా వాడుకున్నంత కాలం, మేము సిద్ధంగానే ఉంటాం" అని వీరాంశ్ తన ప్రసంగాన్ని ముగించారు. ఒక పాక్ మంత్రి కుమారుడు చర్చను అడ్డుకోవాలని చూసినా, ఒక భారతీయ విద్యార్థి వాస్తవాలతో పాక్ అసలు రంగును ప్రపంచం ముందు బయటపెట్టారు.
Veeransh Bhanushali
Oxford Union
Pakistan
Surgical Strike
Mumbai
Terrorism
India Pakistan relations
26/11 Mumbai attacks
Musa Harraj
Pathankot Uri Pulwama attacks

More Telugu News