Himanshi Khurana: టొరొంటోలో భారత సంతతి మహిళ దారుణ హత్య.. భాగస్వామే హంతకుడు?

Himanshi Khurana Murder Toronto Indian Woman Found Dead
  • నిందితుడి కోసం దేశవ్యాప్త గాలింపు
  • 'ఇంటిమేట్ పార్ట్‌నర్ వయోలెన్స్'గా అనుమానిస్తున్న పోలీసులు
  • రంగంలోకి భారత రాయబార కార్యాలయం
ఉపాధి కోసం కెనడా వెళ్లిన ఒక భారతీయ యువతి అక్కడ విగతజీవిగా కనిపించింది. టొరంటోలో నివసిస్తున్న హిమాన్షి ఖురానా (30) అనే యువతి తన నివాసంలో హత్యకు గురయ్యారు. ఈ కేసులో అబ్దుల్ గపూరి (32) అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న పోలీసులు, అతడి కోసం దేశవ్యాప్త అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.

గత శుక్రవారం (డిసెంబర్ 19) రాత్రి హిమాన్షి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు శనివారం తెల్లవారుజామున స్ట్రాచన్ అవెన్యూ పరిసరాల్లోని ఒక నివాసంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆమె మరణాన్ని హత్యగా ధ్రువీకరించిన పోలీసులు దీనిని 'ఇంటిమేట్ పార్ట్‌నర్ వయోలెన్స్' (సన్నిహితుల మధ్య జరిగిన హింస)గా అనుమానిస్తున్నారు.

నిందితుడు అబ్దుల్ గపూరి బాధితురాలికి ముందే పరిచయం ఉన్న వ్యక్తి అని పోలీసులు తెలిపారు. అతనిపై 'ఫస్ట్ డిగ్రీ మర్డర్' కింద కేసు నమోదు చేశారు. నేరం నిరూపితమైతే అతడికి పెరోల్ లేని జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. హిమాన్షి ఖురానా హత్యపై టొరంటోలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

"భారత జాతీయురాలు హిమాన్షి ఖురానా హత్య వార్త మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. ఆమె కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. స్థానిక అధికారులతో మేము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. బాధిత కుటుంబానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నాం" అని సోషల్ మీడియా వేదికగా పేర్కొంది.
Himanshi Khurana
Toronto
Indian national
Murder
Abdul Gapuri
Canada
Crime
Arrest warrant
Strachan Avenue
Intimate partner violence

More Telugu News