దేశవాళీలో ఆడుతున్నందుకు 'రో-కో'కి ఎంత చెల్లిస్తారో తెలుసా..?

  • 15 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీ రీఎంట్రీ
  • విరాట్, రోహిత్‌కు రోజుకు రూ.60,000 మ్యాచ్ ఫీజు
  • చిన్నస్వామి స్టేడియం నుంచి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు మ్యాచ్‌ల మార్పు
  • భద్రతా లోపాల కారణంగా చిన్నస్వామి స్టేడియానికి అనుమతి నిరాకరణ
దేశవాళీ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఘ‌ట్టం ఆవిష్కృతం కానుంది. టీమిండియా స్టార్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో అడుగుపెట్టడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. బెంగళూరులో జర‌గ‌నున్న‌ ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ మ్యాచ్ ద్వారా ఆయన రీఎంట్రీ ఇవ్వనున్నారు.

విరాట్, రోహిత్‌తో పాటు రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ వంటి పలువురు స్టార్ క్రికెటర్లు కూడా ఈ టోర్నీలో ఆడనున్నారు. దేశవాళీ లిస్ట్-ఏ మ్యాచ్‌ల అనుభవం ఆధారంగా మ్యాచ్ ఫీజులు నిర్ణయిస్తారు. 40కి పైగా మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లకు రోజుకు రూ.60,000 చెల్లిస్తారు. ఈ అత్యధిక ఫీజు కేటగిరీలో విరాట్, రోహిత్ ఇద్దరూ ఉన్నారు.

అయితే, అభిమానులకు నిరాశ కలిగించే నిర్ణయం ఒకటి వెలువడింది. భద్రతా కారణాల నేపథ్యంలో బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన విజయ్ హజారే మ్యాచ్‌లను బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కి తరలించారు. కర్ణాటక ప్రభుత్వ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ క్రికెట్ సంఘం అధికారులు తెలిపారు.

బెంగళూరు పోలీసులు స్టేడియంలో మౌలిక సదుపాయాలు, అత్యవసర పరిస్థితుల నిర్వహణలో లోపాలు ఉన్నాయని గుర్తించారు. పలు శాఖల అధికారులతో కూడిన కమిటీ నివేదిక ఆధారంగా చిన్నస్వామి స్టేడియానికి అనుమతి నిరాకరించారు. దీంతో బెంగళూరులో జరిగే అన్ని మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండానే జరగనున్నాయి.

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్న ఏరోస్పేస్ పార్క్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. అభిమానులు ప్రత్యక్షంగా చూడలేకపోయినా, దేశవాళీ క్రికెట్‌లో స్టార్ ఆటగాళ్ల ఆటను చూడటం మాత్రం విశేషమే.


More Telugu News