Telangana: వణుకుతున్న తెలంగాణ.. ముసురుతున్న రోగాలు!

Telangana Cold Wave Causes Spike in Winter Related Illnesses
  • రాష్ట్రంలో దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
  • వాతావరణ మార్పులతో స్వైర విహారం చేస్తున్న వైరస్‌లు
  • జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ప్రజలు
  • మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందన్న వాతావరణశాఖ
  • జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్య నిపుణులు
తెలంగాణను చలిపులి వణికిస్తోంది. భానుడి భగభగలు మాయమై.. ఎముకలు కొరికే చలి పంజా విసురుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో 'చలి జ్వరం' ఇంటింటినీ పలకరిస్తోంది. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన ఈ మార్పులతో వైరస్‌లు స్వైరవిహారం చేస్తున్నాయి. ఫలితంగా ప్రతి ఇంటా జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పుల బాధితులు కనిపిస్తున్నారు. రానున్న మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

సాధారణంగా మన శరీర ఉష్ణోగ్రతను మెదడులోని 'హైపోథాలమస్' గ్రంథి నియంత్రిస్తుంది. అయితే, బయట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువకు పడిపోతే శరీరంలోని ఉష్ణ నియంత్రణ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు 5 నుంచి 13 డిగ్రీల మధ్యే రికార్డవుతుండటంతో బాడీ మెకానిజం దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి బీపీ పెరగడం, తద్వారా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

చలి నుంచి ఉపశమనం కోసం 'రెండు పెగ్గులు' వేయడం పరిష్కారం కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మద్యం తాగేటప్పుడు రక్తనాళాలు వ్యాకోచించి శరీరానికి తాత్కాలికంగా వెచ్చదనం లభించినప్పటికీ, ఆ తర్వాత ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పడిపోతే, అది 'హైపోథెర్మియా' వంటి ప్రాణాంతక స్థితికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.  రోజంతా గోరువెచ్చని నీటినే తాగాలని, ఇది గొంతు సమస్యలను దూరం చేయడమే కాకుండా శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుందని చెబుతున్నారు.

బయటకు వెళ్లేటప్పుడు స్వెట్టర్లు, మఫ్లర్లు, గ్లౌజులు తప్పనిసరిగా ఉపయోగించాలని, ముఖ్యంగా ముక్కు, చెవుల ద్వారా చలి గాలి లోపలికి వెళ్లకుండా జాగ్రత్త పడాలని పేర్కొన్నారు. శ్వాసకోశ సమస్యలున్న వారు రోజుకు రెండుసార్లు ఆవిరి పడితే ఊపిరితిత్తులకు ఉపశమనం లభిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి తాజా ఆకుకూరలు, పండ్లు, ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, ఆస్తమా రోగులు ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, తెల్లవారుజామున, అర్థరాత్రి వేళల్లో ప్రయాణాలు మానుకోవడం ఉత్తమమని, చలి తీవ్రత పెరిగే కొద్దీ బ్యాక్టీరియా విజృంభణ కూడా పెరుగుతుంది కాబట్టి స్వల్ప లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
Telangana
Telangana weather
cold wave
winter diseases
weather forecast
hypothermia
health advisory
cold weather precautions
seasonal diseases
Telangana health

More Telugu News