al-Haddad: టర్కీలో ఘోర విమాన ప్రమాదం: లిబియా సైన్యాధిపతి దుర్మరణం

Turkey Plane Crash Kills Libyan Military Leader Al Haddad
  • టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన ప్రైవేట్ జెట్
  • లిబియా సైన్యాధిపతి జనరల్ మహమ్మద్ అలీ అహ్మద్ అల్-హద్దాద్‌తో సహా ఎనిమిది మంది  మృతి
  • విమానంలో పేలుడు సంభవించిందన్న స్థానిక న్యూస్ చానళ్లు
  • దేశం గొప్ప సైనిక మేధావిని కోల్పోయిందన్న లిబియా ప్రధాని అబ్దుల్ హమీద్
టర్కీ రాజధాని అంకారాలో మంగళవారం రాత్రి ఘోర విమాన ప్రమాదం సంభవించింది. లిబియా సైన్యాధిపతి జనరల్ మహమ్మద్ అలీ అహ్మద్ అల్-హద్దాద్‌తో సహా ఎనిమిది మంది ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఐదుగురు ఉన్నతాధికారులు, ముగ్గురు సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

రక్షణ రంగ చర్చల నిమిత్తం టర్కీకి వచ్చిన లిబియా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం పర్యటన ముగించుకుని తిరిగి బయలుదేరిన 30 నిమిషాలకే ఈ విషాదం చోటుచేసుకుంది. అంకారాలోని ఎసెన్‌బోగా విమానాశ్రయం నుంచి రాత్రి 8:30 గంటలకు బయలుదేరిన 'ఫాల్కన్ 50' బిజినెస్ జెట్ దక్షిణాన ఉన్న హేమనా జిల్లా వద్దకు రాగానే రాడార్‌తో సంబంధాలు కోల్పోయింది. విమానంలో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు స్థానిక టీవీ చానళ్లు ప్రసారం చేసిన సీసీటీవీ దృశ్యాల్లో కనిపిస్తోంది.

ఈ ప్రమాదంపై లిబియా ప్రధాని అబ్దుల్ హమీద్ దబీబా స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ఒక గొప్ప సైనిక మేధావిని కోల్పోయిందని, ఇదొక తీరని లోటని పేర్కొన్నారు. మృతుల్లో అల్-హద్దాద్‌తో పాటు గ్రౌండ్ ఫోర్స్ చీఫ్ జనరల్ అల్-ఫితౌరీ ఘ్రైబిల్, మిలిటరీ మాన్యుఫ్యాక్చరింగ్ అథారిటీ చీఫ్ బ్రిగేడియర్ జనరల్ మహమూద్ అల్-ఖతావి వంటి కీలక అధికారులు ఉన్నారు.

పశ్చిమ లిబియాలో అత్యున్నత కమాండర్‌గా సేవలందిస్తున్న అల్-హద్దాద్ ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో విచ్ఛిన్నమైన లిబియా సైనిక విభాగాలను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అటువంటి నాయకుడు మరణించడం లిబియా అంతర్గత భద్రతా వ్యవహారాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే అంకారా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసి, పలు విమానాలను దారి మళ్లించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు టర్కీ ప్రభుత్వం నలుగురు ప్రాసిక్యూటర్లను నియమించింది. సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
al-Haddad
Libya military
Turkey plane crash
Libya commander death
Ankara plane crash
Falcon 50
Libya internal security
Esenboga Airport
Abdul Hamid Dbeibeh
Libya army

More Telugu News