టీ20 సిరీస్: విశాఖలో శ్రీలంకపై భారత్ అద్భుత విజయం

  • 129 పరుగుల లక్ష్యాన్ని 11.5 ఓవర్లలో ఛేదించిన టీమిండియా
  • 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై భారత్ విజయం
  • 5 టీ20ల సిరీస్‌లో 2-0తో భారత్ ఆధిక్యం
శ్రీలంకతో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన రెండవ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది. 129 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 11.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా 7 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.

ఈ గెలుపుతో భారత్ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. షెఫాలీ వర్మ అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆమె 34 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సుతో 69 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. మిగిలిన బ్యాటర్లలో జెమీమా రోడ్రిగ్స్ 26 పరుగులు, స్మృతి మంధాన 14 పరుగులు, హర్మన్ ప్రీత్ కౌర్ 10 పరుగులు చేశారు.

అంతకముందు, టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో హర్షిత 33 పరుగులు, చమరి ఆటపట్టు 31 పరుగులు, హాసిని పెరీరా 22 పరుగులు చేశారు. భారత బౌలర్లలో శ్రీచరణి, వైష్ణవి శర్మ చెరో రెండు వికెట్లు తీయగా, క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా చెరో వికెట్ పడగొట్టారు.


More Telugu News