దీపూదాస్ పై మోసపూరిత అభియోగాలు మోపారు: షేక్ హసీనా
- బంగ్లాదేశ్ లో హిందూ యువకుడు దీపూదాస్ దారుణ హత్య
- భారత్ లో వెల్లువెత్తుతున్న ఆందోళనలు
- దీపూదాస్ కుటుంబానికి న్యాయం చేస్తామన్న షేక్ హసీనా
బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడు దీపూదాస్ ను అత్యంత పాశవికంగా చంపేసిన ఘటనపై భారత్‌లో తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనను ఖండిస్తూ ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం ముందు వీహెచ్‌పీ, వివిధ హిందూ సంస్థల కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఇక ఈ ఘటనపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా స్పందించారు. దీపూదాస్‌పై మోసపూరిత అభియోగాలు మోపారని, ఆయన మహమ్మద్ ప్రవక్తను అవమానించాడని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని ఆమె స్పష్టం చేశారు. దీపూదాస్ కుటుంబానికి న్యాయం కల్పిస్తానని హసీనా హామీ ఇచ్చారు.
దీపూదాస్ హత్యపై బంగ్లాదేశ్ లోనే కాకుండా ఢిల్లీ నుంచి ఖాట్మండూ వరకు ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. దీపూదాస్ హంతకులను యూనస్ ప్రభుత్వం శిక్షించకుంటే పెద్ద ఉద్యమం చేపడతామని నిరసనకారులు హెచ్చరిస్తున్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలో షేక్ హసీనా పార్టీ పాల్గొనకుండా యూనస్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి.