శ్రీహరికోటలో బ్లూబర్డ్ బ్లాక్-2 మిషన్ కౌంట్‌డౌన్ ప్రారంభం

  • అమెరికా కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్-6ను మోసుకెళ్లనున్న ఎల్‌వీఎం3-ఎం6
  • శ్రీహరికోటలో 24 గంటల కౌంట్‌డౌన్ ప్రారంభం
  • రేపు ఉదయం 8.54 గంటలకు నిందిలోకి ఎగరనున్న రాకెట్
కొత్త తరం అమెరికా కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్-6ను మోసుకెళ్లే ఎల్‌వీఎం3-ఎం6 రాకెట్ ప్రయోగానికి 24 గంటల కౌంట్‌డౌన్ మంగళవారం శ్రీహరికోటలో ప్రారంభమైనట్లు ఇస్రో ప్రకటించింది. బ్లూబర్డ్ బ్లాక్-2 మిషన్ కౌంట్ డౌన్ ప్రారంభమైందని, రేపు ఉదయం 8.54 గంటలకు రాకెట్ నింగిలోకి ఎగరనున్నట్లు వెల్లడించింది.

ఈ ఉపగ్రహం బరువు సుమారు 6,100 కిలోలు ఉంటుంది. స్పేస్‌పోర్ట్‌లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ఎల్‌వీఎం3-ఎం6 వ్యోమనౌకను ప్రయోగించనున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు. అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తోంది.

శాటిలైట్ ద్వారా నేరుగా మొబైల్ కనెక్టివిటీ కోసం ఉద్దేశించిన ప్రాజెక్టు ఈ బ్లూబర్డ్ బ్లాక్-2 మిషన్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా, ఏ సమయంలోనైనా నేరుగా 4జీ, 5జీ వాయిస్, వీడియో కాల్స్, మెసేజ్‌లు, వీడియో ప్రసారాలు చేసేందుకు వీలుగా ఈ ప్రయోగం చేపట్టారు. వాణిజ్య, ప్రభుత్వ అప్లికేషన్లకు సపోర్ట్ చేసేలా దీనిని రూపొందించారు.


More Telugu News