మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ
- ఏవోబీ సరిహద్దులో లొంగిపోయిన 22 మంది మావోలు
- లొంగిపోయిన వారిలో ఆరుగురు డివిజనల్ కమిటీ సభ్యులు
- లొంగిపోయిన మావోయిస్టులపై రూ.2.18 కోట్ల రివార్డు
ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏఓబీ) ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశా మల్కాన్‌గిరి జిల్లాలో 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఆరుగురు డివిజనల్ కమిటీ సభ్యులు, ఆరుగురు ఏరియా కమిటీ సభ్యులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
లొంగిపోయిన మవోయిస్టులు పోలీసులకు ఆయుధాలను అప్పగించారు. వీటిలో ఒక ఏకే-47, రెండు ఇన్సాస్ రైఫిళ్లు, ఒక ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్, మూడు 303 రైఫిళ్లు, రెండు సింగిల్ షాట్ రైఫిళ్లు, అలాగే 14 ల్యాండ్‌మైన్‌లు ఉన్నాయి. పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ 22 మంది మావోయిస్టులపై మొత్తం రూ.2.18 కోట్ల రివార్డు ఉంది.
తాజా లొంగుబాటు ఏఓబీ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు భారీ ఎదురుదెబ్బ అని పోలీసు అధికారులు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ప్రకటించిన నేపథ్యంలో భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్, ఆపరేషన్ కర్రెగుట్ట వంటి ప్రత్యేక దాడులను ముమ్మరం చేశాయి. ఈ ఆపరేషన్లలో పలువురు మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో హతం కాగా, పెద్ద సంఖ్యలో మావోలు పోలీసుల ముందు లొంగిపోతున్నారు.