సత్తా ఉన్నవాళ్లు తక్కువగా మాట్లాడతారు: బొత్స సత్యనారాయణ
- పీకుడు భాష ప్రజలకు ఉపయోగపడదన్న బొత్స
- ప్రభుత్వం ఫెయిల్ అయిందని వ్యాఖ్య
- ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు
మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో పీకుడు డైలాగులు వినిపించవచ్చని, కానీ, ఇలాంటి డైలాగులు ప్రజలకు ఉపయోగపడవని ఆయన అన్నారు. మెడికల్ కాలేజీల పీపీపీలపై మాట్లాడితే చర్యలు ఉంటాయంటూ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి రాదని జోస్యం చెబుతున్నారని విమర్శించారు. పీకుడు భాష డైలాగులకు పనికొస్తాయే కానీ, ప్రజలకు ఎంత మాత్రం ఉపయోగపడదని అన్నారు. చేవ, సత్తా ఉన్నవాళ్లు తక్కువగా మాట్లాడతారని, చేతలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు.
సంక్రాంతి నాటికి రోడ్లపై గోతులు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని... అయితే, అది ఏ సంవత్సరమో ఆయన చెప్పలేదని బొత్స ఎద్దేవా చేశారు. ఎదుటి వ్యక్తిని తూలనాడటం రాజకీయాల్లో మంచిది కాదని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఫెయిల్ అయిందని అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ మారు వేషాల్లో వెళ్లి పరిశీలిస్తే ప్రజల సమస్యలు వారికి అర్థమవుతాయని చెప్పారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.