హీరోయిన్లపై శివాజీ వ్యాఖ్యలు... ఘాటుగా స్పందించిన రాంగోపాల్ వర్మ

  • హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు
  • శివాజీ వ్యాఖ్యలను తప్పుబట్టిన గాయని చిన్మయి శ్రీపాద
  • వివాదంలోకి ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు రాంగోపాల్ వర్మ
  • నీతులు నీ ఇంట్లో  వాళ్లకి చెప్పుకోవాలంటూ శివాజీకి కౌంటర్
హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే గాయని చిన్మయి శ్రీపాద, మంచు లక్ష్మి, అనసూయ వంటి వారు తీవ్రంగా స్పందించగా, తాజాగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా తనదైన శైలిలో ఘాటుగా బదులిచ్చారు.

సోమవారం జరిగిన 'దండోరా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ... "హీరోయిన్లు పద్ధతిగా చీరలు కట్టుకోవాలి, పొట్టి బట్టలతో అందాలు ఆరబోయకూడదు. అలాంటి డ్రెస్సులు వేసుకున్న వారిని చూసి బయటకు ఏమీ అనకపోయినా, దరిద్రపు ముం* అని మనసులో తిట్టుకుంటారు" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ వివాదంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ తీవ్రంగా స్పందించారు. తన సోదరుడు మంచు మనోజ్ ను అభినందిస్తూ మంచు లక్ష్మి చేసిన ట్వీట్‌ను వర్మ రీపోస్ట్ చేశారు. అందులో శివాజీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "ఆ వ్యక్తి పూర్తి పేరు నాకు తెలియదు. శివాజీ... నువ్వెవడివైనా సరే, నీ ఇంట్లోని మహిళలు నీలాంటి సంస్కారహీనుడిని, మురికివాడిని భరించడానికి సిద్ధంగా ఉంటే, వాళ్లకు నీతులు చెప్పుకో. సమాజంలోని ఇతర మహిళలు, సినీ పరిశ్రమలోని వారు, లేదా మరెవరైనా సరే.. వారి విషయంలో నీ అభిప్రాయాలను ఎక్కడ పెట్టుకోవాలో అక్కడే పెట్టుకో" అంటూ వర్మ ఘాటుగా వ్యాఖ్యానించారు.


More Telugu News