టీ20ల్లో వరల్డ్ రికార్డు సృష్టించిన ఇండోనేషియా బౌలర్

  • ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీసిన ఇండోనేషియా బౌలర్ ప్రియాందన
  • కంబోడియాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన
  • తొలి మూడు బంతుల్లోనే హ్యాట్రిక్ పూర్తి
  • అంతర్జాతీయ టీ20ల్లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా గుర్తింపు
అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఇండోనేషియాకు చెందిన ఫాస్ట్ బౌలర్ గెడె ప్రియాందన ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు పడగొట్టి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని ఈ అద్భుత ఫీట్‌ను సాధించిన తొలి బౌలర్‌గా చరిత్రకెక్కాడు.

బాలి వేదికగా కంబోడియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో మంగళవారం ఈ సంచలనం చోటుచేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండోనేషియా, ధర్మ కేసుమా అజేయ శతకం (110) సాయంతో 167 పరుగులు చేసింది. అనంతరం 168 పరుగుల లక్ష్య ఛేదనలో కంబోడియా 15 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లకు 106 పరుగులతో ఫర్వాలేదనిపించింది. కానీ, 16వ ఓవర్ బౌలింగ్‌కు వచ్చిన ప్రియాందన మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. 

ప్రియాందన తన ఓవర్‌లోని తొలి మూడు బంతులకు 3 వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. నాలుగో బంతి డాట్ కాగా, చివరి రెండు బంతులకు మరో రెండు వికెట్లు పడగొట్టాడు. చివరి రెండు బంతుల మధ్య ఒక వైడ్ ఉండడంతో ఈ ఓవర్లో ఒక అదనపు పరుగు మాత్రమే వచ్చింది. దీంతో కంబోడియా 107 పరుగులకే ఆలౌట్ కాగా, ఇండోనేషియా 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఇంతకుముందు టీ20ల్లో లసిత్ మలింగ, రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్ వంటి దిగ్గజాలు ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన సందర్భాలు ఉన్నప్పటికీ, ఐదు వికెట్లు తీయడం ఇదే తొలిసారి. ప్రియాందన అసాధారణ ప్రదర్శన ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.


More Telugu News