Tata Motors: టాటా ఈవీల జోరు... భార‌త రోడ్ల‌పై 2.5 లక్షల ఎలక్ట్రిక్ కార్లు

Tata Motors Electric Cars Reach 25 Lakh Milestone on Indian Roads
  • భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్ల మైలురాయి
  • దేశ ఈవీ మార్కెట్‌లో 66 శాతం వాటాతో టాటా ఆధిపత్యం
  • నెక్సాన్.ev లక్ష అమ్మకాల రికార్డు సాధించిన తొలి ఈవీ
  • దేశ‌వ్యాప్తంగా 2 లక్షలకు పైగా చార్జింగ్ పాయింట్ల ఏర్పాటు
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ప్రయాణంలో టాటా మోటార్స్ మరో చారిత్రక ఘట్టాన్ని నమోదు చేసింది. మంగళవారం టాటా మోటార్స్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం భార‌త రోడ్ల‌పై 2.5 లక్షలకు పైగా టాటా ఎలక్ట్రిక్ కార్లు పరుగులు తీస్తున్నాయి. ఇది భారత ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన మార్కెట్లో టాటా మోటార్స్ ఆధిపత్యాన్ని తెలియ‌జేస్తోంది.

ఒకప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు కేవలం ప్రయోగాత్మకంగా భావించబడితే, ఇప్పుడు అవి సాధారణ వినియోగదారుల మొదటి ఎంపికగా మారుతున్నాయి. ఈ మార్పులో టాటా మోటార్స్ కీలక పాత్ర పోషించింది. 2020లో దేశంలోనే తొలి మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ కారుగా నెక్సాన్.evను ప్రవేశపెట్టిన టాటా, ఆ తర్వాత ఎలక్ట్రిక్ విభాగంలో వేగంగా విస్తరించింది. నెక్సాన్.ev దేశంలో లక్షకు పైగా అమ్మకాలు సాధించిన తొలి ఎలక్ట్రిక్ కారుగా చరిత్ర సృష్టించింది.

ప్రస్తుతం భారత్‌లో అమ్ముడయ్యే ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల్లో సుమారు 66 శాతం వాటా టాటా మోటార్స్‌దే. అంటే రోడ్లపై కనిపించే ప్రతి మూడు ఈవీల్లో రెండు టాటా వాహనాలే. టియాగో.ev, పంచ్.ev, నెక్సాన్.ev, కర్వ్.ev, హారియర్.ev వంటి విభిన్న మోడళ్లతో అన్ని ధరల శ్రేణుల్లో వినియోగదారులకు టాటా అందిస్తోంది. ట్రావెల్ ఏజెన్సీల కోసం XPRES-T EVను కూడా అందుబాటులోకి తెచ్చింది.

ఈ సందర్భంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఎండీ అండ్‌ సీఈఓ శైలేశ్‌ చంద్ర మాట్లాడుతూ.. “ఇది కేవలం కార్ల అమ్మకాల్లో విజయం కాదు. భారతదేశంలో స్వచ్ఛమైన మొబిలిటీ వైపు జరిగిన మార్పుకు నిదర్శనం” అని అన్నారు. ప్రభుత్వ విధానాలు, చార్జింగ్ మౌలిక వసతులు, వినియోగదారుల నమ్మకం కలిసి ఈ విజయంలో భాగమని తెలిపారు.

చార్జింగ్ సౌకర్యాల పరంగా కూడా టాటా ముందంజలో ఉంది. దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా చార్జింగ్ పాయింట్లకు టాటా యాక్సెస్ కల్పిస్తోంది. ఇప్పటికే ప్రధాన రహదారులు, నగరాల్లో 100 మెగా ఫాస్ట్ ఛార్జింగ్ హబ్‌లు పనిచేస్తున్నాయి.
Tata Motors
Tata electric vehicles
electric cars India
Nexon EV
Tiago EV
Punch EV
electric vehicle market
Shailesh Chandra
EV sales India
electric mobility

More Telugu News