ఈ సినిమాలో లాజిక్ ఉంది, మ్యాజిక్ ఉంది... ప్రతి కుటుంబం చూడాలి: చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్

  • బాలకృష్ణ, బోయపాటి కాంబోలో అఖండ-2
  • ఇటీవల విడుదలైన చిత్రం
  • తాజాగా అఖండ-2 చిత్రాన్ని వీక్షించిన చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్
హైదరాబాదులోని ప్రఖ్యాత చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన పూజారి రంగరాజన్ తాజాగా అఖండ-2 చిత్రాన్ని వీక్షించారు. సినిమా చూసిన అనంతరం థియేటర్ వద్ద మీడియాతో మాట్లాడారు. ధర్మం గురించి ఈ సినిమాలో అద్భుతంగా చూపించారని, ప్రతి ఒక్కరూ వీక్షించాలని పిలుపునిచ్చారు. లాజిక్, మ్యాజిక్ రెండూ ఉన్న చిత్రం ఇదని అన్నారు.

"ఇవాళ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన అఖండ-2 చిత్రాన్ని వీక్షించాను. సీట్లోంచి కదలకుండా ఆ సినిమా చూశాను. భగవంతుడు ఉన్నాడా, ఉంటే ఇంత అరాచకాన్ని సహిస్తూ ఉంటాడా అనేది ప్రతి ఒక్క మనిషిలో ఉండే ప్రశ్న. ప్రపంచంలో మిగతా చోట్ల అర్థ, కామం కోసమే జీవిస్తారు... మన దేశంలో మాత్రం ధర్మ, అర్థ, కామ, మోక్షాల కోసం జీవిస్తాం.. వీటిని చతుర్విధ పురుషార్థాలు అంటారు. 

మన గడ్డపై ధర్మమే ముఖ్య భూమిక పోషిస్తూ ఉంటుంది. ధర్మం ఎప్పుడు ఇబ్బందుల్లో ఉంటుందో, అప్పుడు ఏదో ఒక రూపంలో భగవంతుడు వస్తాడు, తన ధర్మాన్ని రక్షించుకుంటాడు అనే ఇతివృత్తం అఖండ-2 చిత్రంలో చూపించారు. ఆలయం అనేది భక్తులకు చెందిన సన్నిధి అనే మా నాన్న గారి మాటలు ఈ సినిమా చూశాక గుర్తుకొచ్చాయి. ఇందులో బాలయ్య డైలాగులు మా నాన్న గారి మాటలను జ్ఞప్తికి తెచ్చాయి. ఆ డైలాగ్ రైటర్ ను అభినందించాలి. 

భగవంతుడ్ని కూడా కమర్షియల్ గా చూస్తున్న రోజుల్లో భగవంతుడు ఎందుకు వస్తాడు అనే కోణం కూడా ఉంది. చెప్పుకుంటూ పోతే గంటసేపు రివ్యూ ఇవ్వవచ్చు. గట్టిగా ఐదు నిమిషాలు కూడా కూర్చుని రాయలేని పనికిమాలిన వాళ్లు ఇచ్చే రివ్యూలు పట్టించుకోనవసరంలేదు. ఈ సినిమా ఎలా ఉంటుందనేది ఎవరో ఎందుకు చెప్పాలి... మీరు చూసి మీరే మీ సొంత రివ్యూ ఇవ్వండి. ఇదే నా విన్నపం. 

నేను ఈ సినిమాను స్వయంగా వీక్షించాను. ఇందులో లాజిక్ ఉందా, మ్యాజిక్ ఉందా అనేది మీరే చూసి తెలుసుకోండి. ఎవరో చెప్పింది నమ్మవద్దు. ప్రతి ఫ్రేములో లాజిక్ ఉంది, మ్యాజిక్ ఉంది. ధర్మాన్ని రక్షించే ఒక సైన్యం కావాలి. కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సినిమా చూడండి. ఇది వినోదాత్మక చిత్రం కాదు... ధర్మం పట్ల మనలోని భావాలను మరింత పెంపొందించే చిత్రం ఇది. ప్రతి కుటుంబం వచ్చి ఈ సినిమా చూడాలని ప్రార్థిస్తున్నాను" అంటూ రంగరాజన్ తన అభిప్రాయాలను వెల్లడించారు.


More Telugu News