మహిళల దుస్తులపై వ్యాఖ్యలు అంగీకరించదగినవి కావు... అది పాతకాలపు ఆలోచన: మంచు మనోజ్

  • మహిళల దుస్తులపై నియంత్రణ పాత ఆలోచన అని మంచు మనోజ్ వ్యాఖ్య
  • మహిళల గౌరవం, స్వేచ్ఛ రాజ్యాంగ హక్కులని స్పష్టీక‌ర‌ణ‌
  • ఎవ‌రైనా స‌రే బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచన
మహిళల దుస్తులపై నటుడు శివాజీ వ్యాఖ్యల నేప‌థ్యంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మంచు మనోజ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక పోస్టు పెట్టారు. తాను గత రాత్రి కొన్ని తీవ్రంగా నిరాశపరిచే వ్యాఖ్యలు చూశానని పేర్కొన్న ఆయన, మహిళల దుస్తులను నియంత్రించడం లేదా వారి మీద నైతిక బాధ్యత మోపడం పాతకాలపు ఆలోచన అని, అసలు అంగీకరించదగినది కాదని స్పష్టం చేశారు. అయితే, ఆయన ఎవరిపేరు ప్రస్తావించకపోయినా ఈ వ్యాఖ్యలు ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ చేసిన ప్రసంగానికి ప్రతిస్పందనగానే మ‌నోజ్ చెప్పార‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

శివాజీ తన ప్రసంగంలో హీరోయిన్లు శరీరం పూర్తిగా కప్పే దుస్తులు ధరించాలని, అభ్యంతరకరమైన దుస్తులు వేసుకోకూడదని సూచించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మంచు మనోజ్, తన ఎక్స్ ఖాతాలో “సభ్యసమాజం మహిళల స్వేచ్ఛ‌ను నియంత్రించదు, వారి హక్కులను కాపాడుతుంది” అంటూ స్పష్టమైన సందేశం ఇచ్చారు.

మహిళల గౌరవం, సమానత్వం, వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగ హక్కులని గుర్తు చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 21ల ఆత్మకు ఇలాంటి వ్యాఖ్యలు విరుద్ధమని చెప్పారు. గౌరవం అనేది దుస్తులపై ఆధారపడదని, వ్యక్తిగత ప్రవర్తన నుంచే ప్రారంభమవ్వాలని మ‌నో త‌న పోస్టులో పేర్కొన్నారు.

అంతేకాకుండా మహిళలను అవమానించేలా మాట్లాడిన కొందరు సీనియర్ నటుల తరఫున తాను క్షమాపణ కోరుతున్నానని చెప్పారు. అలాంటి వ్యాఖ్యల‌పై మౌనం వీడటం, బాధ్యత తీసుకోవడం చాలా అవసరమని ఆయన అన్నారు. మంచు మనోజ్ వ్యాఖ్యలు మహిళా హక్కులపై జరుగుతున్న చర్చకు మరింత బలం చేకూర్చాయి.


More Telugu News