గవాస్కర్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట... వ్యక్తిగత హక్కులకు రక్షణ

  • ఆన్‌లైన్‌లో గవాస్కర్ పేరు దుర్వినియోగం
  • గవాస్కర్ పేరుతో ఫేక్ వార్తలు
  • ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన క్రికెట్ దిగ్గజం
  • ఇంజంక్షన్ ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్‌కు ఢిల్లీ హైకోర్టులో మంగళవారం భారీ ఊరట లభించింది. గవాస్కర్ వ్యక్తిగత (పర్సనాలిటీ), ప్రచార (పబ్లిసిటీ) హక్కులను పరిరక్షిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఇంజంక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. గవాస్కర్ పేరు, ఫోటో, ప్రతిష్ఠను దుర్వినియోగం చేస్తూ ఆన్‌లైన్‌లో ఉన్న అనధికారిక కంటెంట్, వస్తువులను వెంటనే తొలగించాలని సోషల్ మీడియా, ఈ-కామర్స్ వేదికలను ఆదేశించింది.

జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాతో కూడిన ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. గవాస్కర్‌పై తప్పుడు వ్యాఖ్యలను ఆపాదిస్తూ ప్రచారంలో ఉన్న యూఆర్‌ఎల్‌లను 72 గంటల్లోగా తొలగించాలని మెటా, ఎక్స్ కార్ప్ వంటి సంస్థలను ఆదేశించింది. ఒకవేళ యూజర్లు ఆ కంటెంట్‌ను తొలగించడంలో విఫలమైతే, సంబంధిత సోషల్ మీడియా సంస్థలే వాటిని నిలిపివేయాలని స్పష్టం చేసింది. అలాగే, గవాస్కర్ పేరుతో అనధికారికంగా విక్రయిస్తున్న నకిలీ ఆటోగ్రాఫ్‌లు, ఇతర వస్తువుల లిస్టింగ్‌లను కూడా తొలగించాలని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు సూచించింది.

సోషల్ మీడియాలో కొందరు తనకు సంబంధం లేని వ్యాఖ్యలను ఆపాదిస్తున్నారని, ఆన్‌లైన్‌లో తన పేరుతో నకిలీ వస్తువులను అమ్ముతున్నారని ఆరోపిస్తూ సునీల్ గవాస్కర్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం పై విధంగా ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవల కాలంలో పలువురు ప్రముఖులు తమ పర్సనాలిటీ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే నటులు జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ వంటి వారు ఇలాంటి రక్షణ ఉత్తర్వులు పొందారు. తాజాగా ఈ జాబితాలో సునీల్ గవాస్కర్ కూడా చేరారు. ఈ కేసులో తదుపరి విచారణను 2026 మే 22వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.


More Telugu News