టీమిండియా ప్రవర్తనపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తాం: మొహ్సిన్ నఖ్వీ

  • అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో భారత్‌పై పాక్‌ ఘన విజయం
  • 13 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌కు అండర్-19 ఆసియా కప్ టైటిల్
  • భారత ఆటగాళ్ల ప్రవర్తనపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తామన్న పీసీబీ
  • క్రికెట్ స్పిరిట్‌పై సర్ఫరాజ్ అహ్మద్ వ్యాఖ్యలు
అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్‌పై పాకిస్థాన్ భారీ విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. సమీర్ మిన్హాస్ చారిత్రాత్మక శతకంతో మెరిసిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 347/8 భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం భారత్‌ను కేవలం 156 పరుగులకే ఆలౌట్ చేసి 191 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాక్‌కు 13 ఏళ్ల తర్వాత వచ్చిన అండర్-19 ఆసియా కప్ టైటిల్ కాగా, మొత్తం మీద ఇది వారి రెండో టైటిల్‌గా నిలిచింది.

అయితే, ఈ ఫైనల్ మ్యాచ్ అనంతరం వివాదం తలెత్తింది. భారత ఆటగాళ్ల ప్రవర్తనపై పాకిస్థాన్ అండర్-19 జట్టు కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. మ్యాచ్ సమయంలో భారత ఆటగాళ్లు రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆరోపించాడు. దీనిపై స్పందించిన పాక్‌ క్రికెట్ బోర్డు ఛైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ, ఈ అంశంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆధ్వర్యంలో జరిగిన జట్టు సన్మాన కార్యక్రమంలో నఖ్వీ మాట్లాడుతూ, “క్రీడలు, రాజకీయాలు వేరుగా ఉండాలి. కానీ, ఫైనల్‌లో భారత ఆటగాళ్ల ప్రవర్తన సరైనది కాదు” అని వ్యాఖ్యానించారు. సర్ఫరాజ్ కూడా ఇది క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. అయితే, పాకిస్థాన్ ఆటగాళ్లు మాత్రం విజయం అనంతరం క్రీడాస్ఫూర్తితోనే సంబరాలు చేసుకున్నారని ఆయన అన్నారు.


More Telugu News