శివాజీ వ్యాఖ్యలతో చెలరేగిన వివాదం.. ‘మా బాడీ మా ఇష్టం’ అంటూ అనసూయ ఘాటు స్పంద‌న‌!

  • ‘దండోరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ వ్యాఖ్యలు వివాదాస్పదం
  • హీరోయిన్ల దుస్తులు, గ్లామర్‌పై ఘాటు విమర్శలు
  • శివాజీ వ్యాఖ్యలకు అనసూయ స్ట్రాంగ్ కౌంటర్
  • మహిళల స్వేచ్ఛ, వ్యక్తిగత ఎంపికలపై నెట్టింట‌ చర్చ
నటుడు శివాజీ తన తాజా చిత్రం ‘దండోరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారి తీశాయి. నిన్న‌ రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన నేటితరం హీరోయిన్ల గ్లామర్ ప్రదర్శనపై ఘాటు వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. మహిళల అందం చీరలోనే ఇమిడి ఉందని, అభ్యంతరకరంగా దుస్తులు ధరిస్తే అందులో విలువ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా పొట్టి బట్టలు వేసుకున్న హీరోయిన్లను బయట పొగిడినా, లోపల మాత్రం అసహ్యించుకుంటారని చెప్పేందుకు శివాజీ కొన్ని అభ్యంతరకర పదాలను ఉదాహరణగా వాడటం తీవ్ర విమర్శలకు కారణమైంది. సావిత్రి, సౌందర్య వంటి మహానటులను ఆదర్శంగా తీసుకోవాలని, గ్లామర్‌కు ఒక హద్దు ఉండాలంటూ ఆయన హితవు పలికారు. అయితే, ఈ వ్యాఖ్యలు మహిళల వ్యక్తిగత స్వేచ్ఛపై దాడిగా భావిస్తూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ అంశంపై ఇప్పటికే గాయని చిన్మయి స్పందించగా, తాజాగా యాంకర్, నటి అనసూయ భ‌ర‌ద్వాజ్ కూడా శివాజీ వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన అనసూయ, “ఇది మా శరీరం.. మీది కాదు. మాకు నచ్చినట్లే మేము ఉంటాం” అంటూ స్పష్టం చేశారు. మహిళలకు తమకు నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉందని, వారి వ్యక్తిగత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోవడం తగదనే అర్థం వ‌చ్చేలా ఆమె త‌న‌ సోష‌ల్ మీడియాలో పోస్టులో పేర్కొన్నారు.


More Telugu News