విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీ రీఎంట్రీ.. అభిమానులకు నిరాశ

  • ఢిల్లీ, ఆంధ్ర మ్యాచ్ ప్రేక్షకులు లేకుండా నిర్వహణ
  • భద్రతా కారణాలతో ప్రభుత్వ నిర్ణయం
  • ఢిల్లీ జట్టుకు క‌లిసి రానున్న‌ కోహ్లీ ప్రాతినిధ్యం
టీమిండియా సీనియర్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ మళ్లీ దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. 2025-26 విజయ్ హజారే ట్రోఫీ ద్వారా ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్న కోహ్లీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఆయన బ్యాటింగ్‌ను ప్రత్యక్షంగా చూసే అవకాశం అభిమానులకు లేదు. ఢిల్లీ, ఆంధ్ర జట్ల మధ్య జరిగే తొలి రౌండ్ మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా జరగనుంది.

ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్‌ఫో కథనం ప్రకారం కర్ణాటక ప్రభుత్వం భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్‌లను మూసివేసిన తలుపుల వెనుక నిర్వహించాలంటూ కేఎస్‌సీఏకు ఆదేశించే అవ‌కాశం ఉందని స‌మాచారం. పోలీసుల అనుమతి లభించకపోతే, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)ను ప్రత్యామ్నాయ వేదికగా సిద్ధం చేస్తున్నారు. మొదట రెండు స్టాండ్లను తెరచి 2,000 నుంచి 3,000 మంది ప్రేక్షకులకు అనుమతి ఇవ్వాలని కేఎస్‌సీఏ భావించినా ప్రభుత్వం దీనిని తిరస్కరించింది.

పండుగ సీజన్‌లో ప్రముఖ ఆటగాళ్లు పాల్గొనడం వల్ల స్టేడియం పరిసరాల్లో గందరగోళం ఏర్పడే అవకాశముందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కోహ్లీతో పాటు రిషభ్ పంత్ అందుబాటులో ఉండటంతోనే వేదికను ఆలూర్ నుంచి చిన్నస్వామికి మార్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో మ్యాచ్‌లు జరిగితే, అక్కడ కోహ్లీ తొలిసారి మ్యాచ్ ఆడినట్లవుతుంది.

ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక అర్ధశతకం సాధించిన కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అదే జోరును దేశవాళీ క్రికెట్‌లో కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ అనంతరం న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో కూడా కోహ్లీ పాల్గొననున్నాడు. బీసీసీఐ నిబంధనల మేరకు కేంద్ర కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు దేశవాళీ టోర్నీల్లో పాల్గొనాల్సి ఉండటంతో కోహ్లీ ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వ‌హించనున్నాడు. ఈ టోర్నీలో ఢిల్లీ జ‌ట్టుకు రిషభ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.


More Telugu News