తమిళనాడులో ఎన్నికల సంక్రాంతి.. పొంగల్ కానుక ప్రకటించిన ప్రభుత్వం

  • ఎన్నికల వేళ స్టాలిన్ సర్కారు వ్యూహాత్మక నిర్ణయం
  • రేషన్‌ కార్డు ఉన్న ప్రతీ ఇంటికీ రూ.3 వేలు
  • ఓ ధోతి, చీర, నిత్యావసరాలు కూడా అందించనున్న ప్రభుత్వం
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడు సర్కారు వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి సంక్రాంతి కానుక ప్రకటించింది. ఎన్నికల ముంగిట వస్తున్న పండుగ కావడంతో ఈసారి పొంగల్ కానుక భిన్నంగా ఉండనుంది. పొంగల్ సందర్భంగా తమిళనాడులోని రేషన్ కార్డుదారులకు నగదు, నిత్యావసరాలతో పాటు ఓ ధోతి, చీర కూడా ఇవ్వనున్నట్లు పేర్కొంది.

తమిళనాడు పొంగల్ గిఫ్ట్ పథకం 2026 లో భాగంగా అర్హులైన ప్రతీ కుటుంబానికి రూ.3 వేల నగదుతో పాటు గిఫ్ట్ హ్యాంపర్‌ను అందించనున్నట్లు తెలిపింది. జనవరి రెండవ వారంలో సీఎం ఎంకే స్టాలిన్  ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. పంపిణీ ప్రక్రియను సులభతరం చేయడానికి జనవరి మొదటి వారంలో రేషన్ షాపు సిబ్బంది ఇంటింటికీ తిరిగి టోకెన్లు పంపిణీ చేస్తారు. దానిపై పేర్కొన్న తేదీ, సమయం ఆధారంగా లబ్ధిదారులు రేషన్ షాప్‌ లకు వెళ్లి పొంగల్ కానుక అందుకోవచ్చని తమిళనాడు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

పొంగల్ గిఫ్ట్ లో ఏముంటాయంటే..
ఒక కిలో బియ్యం, కిలో చక్కెర, ఒక పొడవాటి చెరుకు గడ, ధోతీ, చీర, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, యాలకులతో పాటు రూ.3 వేల నగదు.


More Telugu News