ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట ఉద్రిక్తత

  • దీపు చంద్ర దాస్ హత్యపై ఢిల్లీలో భారీ నిరసనలు
  • ఢిల్లీలోని బంగ్లా హైకమిషన్ ఎదుట కట్టుదిట్టమైన భద్రత
  • బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులపై ఆగ్రహం
  • భారత్‌లో దౌత్య కార్యాలయాల భద్రతపై బంగ్లాదేశ్ ఆందోళన
బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ హత్యకు నిరసనగా న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట నిరసనలు కొన‌సాగుతున్నాయి. గత వారం మైమెన్సింగ్ జిల్లాలో ఇస్లామిస్ట్ గుంపు దాడిలో దీపు దారుణంగా హత్యకు గురికావడం దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపింది. ఈ ఘటనను ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ), బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు, దేవాలయాల ధ్వంసం తక్షణమే ఆపాలని వారు డిమాండ్ చేశారు.

నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు హైకమిషన్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మూడు వ‌రుస‌ల బారికేడ్లు ఏర్పాటు చేసి, పోలీసు, పారా మిలిటరీ దళాలను మోహరించారు. అయినప్పటికీ కొంతమంది నిరసనకారులు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీపు దాస్‌కు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. “ఈరోజు మనం గొంతెత్తకపోతే, రేపు ప్రతి ఒక్కరూ దీపే అవుతారు” అంటూ ఒక నిరసనకారి చేసిన వ్యాఖ్య అక్కడి ఉద్రిక్తతను ప్రతిబింబించింది.

ఈ నెల‌ 19న బంగ్లాదేశ్ మైమెన్సింగ్‌లోని బలూకాలో 25 ఏళ్ల గార్మెంట్ ఫ్యాక్టరీ కార్మికుడు దీపు చంద్ర దాస్‌పై దైవదూషణ ఆరోపణలతో గుంపు దాడి చేసి, అతని మృతదేహాన్ని తగలబెట్టడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఇప్పటివరకు కనీసం 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇదిలా ఉంటే... భారత్‌లోని బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయాలపై జరిగిన నిరసనలపై బంగ్లాదేశ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో భారత హైకమిషనర్‌ను పిలిపించి నిరసన తెలిపింది. దౌత్య కార్యాలయాలపై హింస, బెదిరింపులు అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధమని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నెల‌ 20న ఢిల్లీలో నిరసన, 22న సిలిగురిలోని బంగ్లాదేశ్ వీసా కేంద్రంపై జరిగిన విధ్వంసాన్ని ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భారత్‌ను కోరింది.


More Telugu News