న్యూజిలాండ్ లో సిక్కుల ర్యాలీని అడ్డుకున్న క్రైస్తవులు.. హాకా నృత్యం వీడియో ఇదిగో!

  • నగర్ కీర్తన్ చేపట్టిన సిక్కులు.. అడ్డుకున్న క్రిస్టియన్లు
  • దేవుడు ఒక్కడే.. అది జీసస్ మాత్రమేనంటూ నినాదాలు
  • ఇది మీ ఇండియా కాదంటూ హాకా నృత్యం చేస్తూ వార్నింగ్
న్యూజిలాండ్ లోని సౌత్ ఆక్లాండ్ లో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక సిక్కులు చేపట్టిన నగర్ కీర్తన్ ర్యాలీని స్థానిక క్రిస్టియన్లు అడ్డుకున్నారు. కత్తులు, ఆయుధాలతో ర్యాలీ తీయడానికి ఇది మీ ఇండియా కాదు, మా న్యూజిలాండ్ అంటూ నినాదాలు చేశారు. బ్యానర్లు ప్రదర్శిస్తూ, న్యూజిలాండ్ సంప్రదాయ నృత్యం హాకా చేస్తూ హెచ్చరించారు. స్థానిక పెంటకోస్తల్ ఫాస్టర్ బ్రయాన్ తమాకీ ఆధ్వర్యంలో ఆయన ఫాలోవర్లు ఈ నిరసన చేపట్టారు. ‘కీప్ ఎన్ జే ఎన్ జే’ అన్న నినాదాలతో కూడిన టీ షర్టులు ధరించి సిక్కుల ర్యాలీని అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా ఫాస్టర్ బ్రయాన్ తమాకీ సోషల్ మీడియాలో ‘ఇది మా దేశం, మా నేల, మా రోడ్లు. ఇక్కడ మాకు జీసస్ ఒక్కడే దేవుడు. మా నేలపై ఖలిస్థానీ జెండాలను ఎగురవేయడానికి ఒప్పుకోం. న్యూజిలాండ్ క్రైస్తవ దేశం. ఇక్కడ ఖలిస్థానీలకు చోటులేదు’ అంటూ ఓ పోస్టు పెట్టారు. ఎలాంటి హింసకు, అల్లర్లకు చోటివ్వకుండా ‘ఇది మా దేశం. ఇక్కడ ఖలిస్థానీ ఉగ్రవాదులకు చోటులేదు’ అనే స్పష్టమైన సందేశాన్ని తన అనుచరులు చాటిచెప్పారని అన్నారు. అక్లాండ్ హార్బర్ బ్రిడ్జి వద్ద జనవరి 31న న్యూజిలాండ్ డే వేడుకలు జరుపుకుందాం రమ్మంటూ ఫాస్టర్ బ్రయాన్ తమాకీ ఈ పోస్టు ద్వారా పిలుపునిచ్చారు.

రాజకీయ నేతల విమర్శలు..
ఫాస్టర్ బ్రయాన్ తమాకీ, ఆయన అనుచరులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు న్యూజిలాండ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పలువురు ఎంపీలు, నేతలు ఫాస్టర్ బ్రయాన్ తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు. సిక్కుల మతపరమైన ర్యాలీని అడ్డుకోవడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్ స్పందిస్తూ.. న్యూజిలాండ్ లో 300 వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజలు స్వేచ్ఛగా నివసిస్తున్నారని పేర్కొన్నారు. వేర్వేరు మతాలు, వేర్వేరు పండుగలు ప్రశాంతంగా జరుపుకుంటున్నారని తెలిపారు. సిక్కుల విషయానికే వస్తే.. న్యూజిలాండ్ లో 1800 ల నుంచి సిక్కులు ఇక్కడ ఉంటున్నారని ఆమె గుర్తుచేశారు. అందువల్ల, ఎవరు న్యూజిలాండ్ వాసులు, ఎవరు పరాయివారనేది కేవలం ఒక వ్యక్తి తన కొద్దిమంది అనుచరులతో కలిసి నిర్ణయించలేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News