ప్రియుడితో కలిసి భర్తను చంపి ముక్కలుగా కోసి సంచిలో కుక్కిన భార్య!

  • ‘బ్లైండ్ మర్డర్’ కేసు మిస్టరీని ఛేదించిన యూపీ పోలీసులు
  • ప్రియుడితో అభ్యంతరకర స్థితిలో ఉండగా భార్యను చూసిన భర్త
  • ప్రియుడితో కలిసి భర్తను తలపై కొట్టి చంపేసిన భార్య
  • ఆపై కట్టర్ తెప్పించి మృతదేహాన్ని ముక్కలు చేసిన వైనం
  • నిందితులను పట్టించిన మృతుడి చేతిపై ఉన్న పచ్చబొట్టు
సంచలనం సృష్టించిన 'బ్లైండ్ మర్డర్' కేసు మిస్టరీని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్య ఆట కట్టించి కటకటాల వెనక్కి పంపారు. ఈ నెల 15న చందౌసి ప్రాంతంలోని ఒక ఈద్గా వెనుక నల్లటి బ్యాగులో కుళ్లిన స్థితిలో ఒక మనిషి మొండెం లభ్యమైంది. తల లేకపోవడంతో ఆ వ్యక్తి ఎవరో గుర్తు పట్టడం పోలీసులకు సవాలుగా మారింది. అయితే, ఆ మొండెం చేతిపై ‘రాహుల్’ అనే పేరు టాటూగా ఉండటాన్ని పోలీసులు గమనించారు. అదే ఈ కేసులో కీలకంగా మారింది.

రాహుల్ అనే పేరుతో ఉన్న మిస్సింగ్ కేసులను ఆరా తీయగా రూబీ అనే మహిళ తన భర్త రాహుల్ కనిపించడం లేదని నవంబర్ 24న ఫిర్యాదు చేసినట్టు తేలింది. పోలీసులు ఆమెను పిలిపించి ఆ మొండెం పక్కన ఉన్న బట్టలను చూపించారు. కానీ ఆ కిలాడీ భార్య ఏమాత్రం తడబడకుండా ‘ఇవి నా భర్తవి కావు’ అని చెప్పింది. అయితే ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమె మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని తనిఖీ చేశారు.

పోలీసులు రూబీ ఫోన్ గ్యాలరీని వెతుకుతుండగా ఒక ఫోటో కనిపించింది. అందులో తన భర్త రాహుల్ వేసుకున్న టీ-షర్ట్, ఆ బ్యాగులో దొరికిన టీ-షర్ట్ ఒకటేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆ ఫోటోను చూపించి గట్టిగా నిలదీయడంతో రూబీ అసలు విషయాన్ని  ఒప్పుకుంది.

రూబీకి గౌరవ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. నవంబర్ 17 అర్ధరాత్రి రూబీ తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. అదే సమయంలో హఠాత్తుగా భర్త రాహుల్ రావడంతో వారిద్దరినీ అభ్యంతరకర స్థితిలో చూశాడు. గొడవ మొదలవడంతో రూబీ, గౌరవ్ కలిసి రాహుల్ తలపై బలంగా కొట్టి అక్కడికక్కడే చంపేశారు.

నేరం బయటపడకుండా ఉండేందుకు మరుసటి రోజు కట్టర్ మెషీన్‌ను తెప్పించి రాహుల్ శరీరాన్ని ముక్కలుగా కోశారు. వాటిని ఒక బ్యాగులో పెట్టి 50 కిలోమీటర్ల దూరంలోని గంగా నదిలో పడేశారు. మొండాన్ని మరో బ్యాగులో పెట్టి ఊరి బయట పడేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వారం రోజుల తర్వాత స్వయంగా పోలీసుల వద్దకు వెళ్లి భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. పోలీసులు తాజాగా ఆ కట్టర్ మెషీన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రూబీ, ఆమె ప్రియుడు గౌరవ్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నదిలో పడేసిన మిగిలిన శరీర భాగాల కోసం గాలింపు కొనసాగుతోంది.


More Telugu News