మహిళా క్రికెటర్లకు శుభవార్త.. దేశవాళీ మ్యాచ్ ఫీజులను రెట్టింపు చేసిన బీసీసీఐ

  • సీనియర్ ఆటగాళ్లకు రోజుకు రూ.50,000-రూ.60,000 వరకు ఆదాయం
  • అండర్-19, అండర్-23 మహిళా క్రికెటర్లకూ భారీ పెంపు
  • అంపైర్లు, మ్యాచ్ రిఫరీలకు కూడా పెరిగిన పారితోషికం
భారత మహిళల క్రికెట్‌కు బీసీసీఐ పెద్ద ప్రోత్సాహం ఇచ్చింది. ఇటీవల భారత్ మహిళల జట్టు తొలి వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న నేపథ్యంలో దేశవాళీ క్రికెట్‌లో మహిళా ఆటగాళ్లు, అధికారుల మ్యాచ్ ఫీజులను గణనీయంగా పెంచుతూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భారీ పెంపునకు బోర్డు అత్యున్నత సంస్థ అయిన ఏపెక్స్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. దేశవాళీ క్రికెట్ వ్యవస్థలో మరింత న్యాయమైన వేతన నిర్మాణాన్ని తీసుకురావడమే దీని లక్ష్యం అని బీసీసీఐ స్పష్టం చేసింది.

స‌వ‌రించిన‌ వేతనాల‌ ప్రకారం సీనియర్ మహిళా దేశవాళీ క్రికెటర్లు ఇప్పుడు మ్యాచ్ లో ఒక్కో రోజుకు రూ.50,000 నుంచి రూ.60,000 వరకు సంపాదించనున్నారు. ఇది ఇప్పటివరకు లభిస్తున్న రూ.20,000 (రిజర్వ్‌లకు రూ.10,000)తో పోలిస్తే భారీ పెరుగుదల. వన్డేలు, బహుళ రోజుల టోర్నీల్లో ప్లెయింగ్‌ ఎలెవన్‌లో ఉండే ఆటగాళ్లకు రోజుకు రూ.50,000 చెల్లించనుండగా, రిజర్వ్ ప్లేయ‌ర్ల‌కు రూ.25,000 అందనుంది.

జాతీయ స్థాయి టీ20 టోర్నీల్లో ప్లెయింగ్‌ ఎలెవన్ ఆటగాళ్లకు మ్యాచ్ రోజుకు రూ.25,000, రిజర్వ్‌లకు రూ.12,500 చెల్లిస్తారు. ఒక సీజన్‌లో అన్ని ఫార్మాట్లలో ఆడే అగ్రశ్రేణి మహిళా క్రికెటర్ ఇప్పుడు ఏడాదికి రూ.12 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉందని బీసీసీఐ అధికారులు తెలిపారు.

మహిళా జూనియర్ క్రికెటర్లకూ ఈ పెంపు వర్తిస్తుంది. అండర్-23, అండర్-19 ఆటగాళ్లకు రోజుకు రూ.25,000, రిజర్వ్‌లకు రూ.12,500 చెల్లించనున్నారు. అంతేకాకుండా అంపైర్లు, మ్యాచ్ రిఫరీల పారితోషికాలు కూడా భారీగా పెరిగాయి. దేశవాళీ లీగ్ మ్యాచ్‌లకు రోజుకు రూ.40,000, నాకౌట్ మ్యాచ్‌లకు రూ.50,000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు.

ఈ నిర్ణయం మహిళా క్రికెటర్లకు ఆర్థిక భద్రత, ప్రోత్సాహం కల్పించడమే కాకుండా దేశవాళీ క్రికెట్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని బీసీసీఐ పేర్కొంది.


More Telugu News