Lagnajita Chakraborty: స్టేజ్‌పై సింగర్‌కు వేధింపులు.. భక్తి పాటలు వద్దంటూ దాడికి యత్నం!

Lagnajita Chakraborty Harassed at Concert Demanded to Stop Singing Bhakti Songs
  • పశ్చిమ బెంగాల్‌లోని ఈస్ట్ మిడ్నాపూర్‌లో ఘటన
  • లైవ్ కన్సర్ట్‌లో పాట పాడుతుండగా దూసుకొచ్చిన వ్యక్తి
  • భక్తి పాటలు పక్కనపెట్టి సెక్యులర్ పాటలు పాడాలని హుకుం
  • రాజకీయ రంగు పులుముకున్న ఘటన
పశ్చిమ బెంగాల్‌లోని ఈస్ట్ మిడ్నాపూర్‌లో ప్రముఖ బెంగాలీ గాయని లగ్నజిత చక్రవర్తికి ఊహించని అనుభవం ఎదురైంది. లైవ్ కన్సర్ట్‌లో పాట పాడుతుండగా ఒక వ్యక్తి ఆమెపై దాడికి ప్రయత్నించడమే కాకుండా భక్తి పాటలు ఆపి, సెక్యులర్ (మతాతీత) పాటలు పాడాలంటూ హుకుం జారీ చేశాడు. భగవాన్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం లగ్నజిత మ్యూజికల్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. షో మొదలైన 45 నిమిషాల వరకు అంతా సాఫీగానే సాగింది. ఈ క్రమంలో లగ్నజిత త్వరలో విడుదల కానున్న ‘దేవీ చౌధురాని’ సినిమాలోని ‘జాగో మా’ అనే పాట పాడారు.

పాట ముగిసిన వెంటనే ఓ వ్యక్తి ఒక్కసారిగా స్టేజ్‌పైకి దూసుకొచ్చాడు. దీంతో అక్కడున్న వారు అడ్డుకున్నారు. ఆ సమయంలో అతడు గట్టిగా అరుస్తూ.. ‘‘నీ 'జాగో మా’ పాటలు ఇక చాలు.. ఏదైనా సెక్యులర్ సాంగ్ పాడు" అని డిమాండ్ చేసినట్టు గాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆ పాట దేవుడి గురించి కాదు!
ఈ వివాదంపై పాట రచయిత రితమ్ సేన్ స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. ‘జాగో మా’ పాట ఏ దేవత గురించో కాదని, అది కేవలం ‘మాతృత్వం’, మహిళా శక్తిని చాటిచెప్పే పాట అని ఆయన క్లారిటీ ఇచ్చారు. బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రం కోసం ఈ పాటను రాశారని తెలిపారు. ఈ ఘటనపై బెంగాల్ రాజకీయాల్లో వేడి రాజుకుంది. నిందితుడు టీఎంసీ కార్యకర్త అని బీజేపీ ఆరోపిస్తుండగా, ప్రభుత్వం మాత్రం అటువంటిది ఏమీ లేదని కొట్టిపారేసింది.

ఘటన జరిగిన వెంటనే లగ్నజిత పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, ఫిర్యాదు తీసుకోవడానికి స్థానిక అధికారి నిరాకరించినట్టు సమాచారం. ఉన్నతాధికారుల జోక్యంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. అలాగే, విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు భగవాన్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అధికారి షాహెన్షా హక్‌ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ‘‘నేను కళాకారిణిని.. తదుపరి షోలో కూడా 'జాగో మా' పాటే పాడుతాను. పోలీసులు నాకు రక్షణ కల్పిస్తారనే నమ్మకం ఉంది’’ అని లగ్నజిత ధీమా వ్యక్తం చేశారు.
Lagnajita Chakraborty
Bengali singer
East Midnapore
Jago Ma song
Mahaboob Malik
West Bengal
Bhagwanpur
Secular songs
Devi Chaudhurani movie
Rittham Sen

More Telugu News