దేశీయ వ్యవస్థలను బీజేపీ ఆయుధాలుగా మార్చుకుంది: బెర్లిన్‌లో రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

  • రాజ్యాంగ, ప్రభుత్వ వ్యవస్థలు బీజేపీ గుప్పిట్లో ఉన్నాయన్న రాహుల్
  • ప్రతిపక్షాల అణచివేతకు ఈడీ, సీబీఐని వాడుకుంటున్నారని ఆరోపణ
  • బీజేపీ నేతలపై ఈడీ, సీబీఐ కేసు ఒక్కటి కూడా ఉండదెందుకని ప్రశ్న
భారతదేశంలోని రాజ్యాంగ, ప్రభుత్వ వ్యవస్థలను బీజేపీ తన గుప్పిట్లోకి తీసుకుందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. జర్మనీలోని 'హెర్టీ స్కూల్'లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలను అణచివేయడానికి ఆయుధాలుగా వాడుతున్నారని మండిపడ్డారు.

బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలోని మేధో సంస్థలు, దర్యాప్తు ఏజెన్సీలపై దాడి జరుగుతోందని రాహుల్ ఆరోపించారు. ‘‘బీజేపీ నేతలపై ఈడీ, సీబీఐలలో ఒక్క కేసు కూడా ఉండదు. కానీ, ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో, వారిపైనే రాజకీయ కేసులు బనాయిస్తున్నారు. ఒక వ్యాపారవేత్త కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే, వెంటనే బెదిరింపులు వస్తున్నాయి. దేశ వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేయడం లేదు’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ ఈ సంస్థలను నిర్మించిందని, వాటిని దేశ ఆస్తులుగా చూసిందే తప్ప, పార్టీ సొత్తుగా భావించలేదని ఆయన గుర్తు చేశారు.

భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న రాహుల్.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల దొంగతనం జరిగిందని మరోసారి ఆరోపించారు. హర్యానాలో కాంగ్రెస్ గెలిచినప్పటికీ ఫలితాలను మార్చేశారని, మహారాష్ట్ర ఎన్నికలు కూడా పారదర్శకంగా జరగలేదని ఆయన విమర్శించారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు, డూప్లికేట్ ఎంట్రీలపై ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించినా స్పందన లేదని, భారత ఎన్నికల యంత్రాంగంలో లోపాలు ఉన్నాయని దుయ్యబట్టారు.

ప్రధాని మోదీ ఆర్థిక నమూనా విఫలమైందని, అది డెడ్ ఎండ్‌కు చేరుకుందని రాహుల్ వ్యాఖ్యానించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ అనుసరిస్తున్న విధానాలు భారతీయుల మధ్య విద్వేషాలను పెంచి, సామాజిక ఉద్రిక్తతలకు దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. ఇది కేవలం రాజకీయ పోరాటం మాత్రమే కాదని, రెండు భిన్నమైన ఆలోచనా విధానాల మధ్య జరుగుతున్న పోరాటమని ఆయన అభివర్ణించారు.

ఐదు రోజుల జర్మనీ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ బెర్లిన్‌లోని ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. అలాగే జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిచ్ మెర్జ్‌తో పాటు మాజీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్, వైస్ ఛాన్సలర్ లార్స్ క్లింగ్‌బీల్‌లను కలుసుకున్నారు. పర్యటనలో భాగంగా బీఎండబ్ల్యూ ఫ్యాక్టరీని సందర్శించిన ఆయన, భారతదేశంలో ఉత్పాదక రంగాన్ని ఎలా బలోపేతం చేయాలనే అంశంపై అక్కడి ప్రతినిధులతో చర్చించారు.


More Telugu News