ఐటీ చేతికి సోషల్ మీడియా ఖాతాల యాక్సెస్... ప్యాక్ట్ చెక్ ఇదిగో!

  • ఐటీ విభాగంపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన కేంద్రం
  • దాడులు,సోదాల సమయంలోనే డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌లను యాక్సెస్ చేసే అధికారం ఉందని వెల్లడి
  • డిజిటల్ రికార్డుల స్వాధీనాన్ని మాత్రమే కొత్తగా చేర్చినట్లు వెల్లడి
వచ్చే ఏడాది ఏప్రిల్ 1, 2026 నుంచి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ ప్రజల సోషల్ మీడియా ఖాతాలు, ఈమెయిల్స్, ఇతర డిజిటల్ వేదికలపై నిఘా పెట్టనుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వార్త పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం తేల్చి చెప్పింది.

కొత్త ఆదాయపు పన్ను చట్టం, 2025 ప్రకారం పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ఐటీ అధికారులకు ఈ విస్తృత అధికారాలు కల్పించారంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పీఐబీ దీనిపై స్పష్టతనిచ్చింది. ఈ నిబంధనలు కేవలం పన్ను ఎగవేతకు సంబంధించి ఐటీ శాఖ నిర్వహించే అధికారిక సోదాలు, సర్వే ఆపరేషన్లకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది.

ఎవరికి వర్తిస్తుంది?
ప్రభుత్వం ఇచ్చిన వివరణ ప్రకారం, భారీగా పన్ను ఎగవేసినట్లు బలమైన ఆధారాలు ఉండి, ఒక వ్యక్తి లేదా సంస్థపై అధికారికంగా సోదాలు జరుగుతున్నప్పుడు మాత్రమే వారి డిజిటల్ స్పేస్‌ను పరిశీలించే అధికారం అధికారులకు ఉంటుంది. అంతేకానీ, సాధారణ పన్ను చెల్లింపుదారులు, రొటీన్ అసెస్‌మెంట్లు లేదా స్క్రూటినీ కేసుల్లో ఉన్నవారి ఈమెయిళ్లు, సోషల్ మీడియా ఖాతాలు, క్లౌడ్ స్టోరేజీని చూసే అధికారం ఐటీ శాఖకు లేదు.

ఇప్పటికే అమల్లో ఉన్న ఆదాయ పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 132 ప్రకారం.. భౌతిక సోదాల సమయంలో పత్రాలు, ఆధారాలు స్వాధీనం చేసుకునే అధికారం ఉంది. ఇప్పుడు డిజిటల్ యుగానికి అనుగుణంగా ఆ నిబంధనలను ఆధునికీకరించారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్, డిజిటల్ వాలెట్లు, క్రిప్టో ఆస్తులు, ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు, కమ్యూనికేషన్ రికార్డులు వంటి "వర్చువల్ డిజిటల్ స్పేస్‌"లను కూడా సోదాల్లో భాగంగా పరిశీలించవచ్చు. ఈ చర్యలు కేవలం నల్లధనం, పెద్ద ఎత్తున పన్ను ఎగవేతలను లక్ష్యంగా చేసుకున్నవే తప్ప, చట్టాన్ని గౌరవించే సాధారణ పౌరుల కోసం కాదని అధికారులు ఉద్ఘాటించారు.

ఆందోళనలు.. ప్రభుత్వ హామీ
కొత్త నిబంధనలతో అధికారులకు అపరిమిత అధికారాలు లభించి, వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని కొందరు నిపుణులు, విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, "బలమైన కారణాలు ఉన్నాయని నమ్మినప్పుడు" మాత్రమే సోదాలు నిర్వహించేలా, పాత చట్టంలో మాదిరిగానే కఠినమైన నిబంధనలు ఉన్నాయని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

నిజాయితీగా తమ ఆదాయాన్ని ప్రకటించి, సకాలంలో పన్నులు చెల్లించే పౌరులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐటీ శాఖ పునరుద్ఘాటించింది. పన్ను సంస్కరణలపై వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించింది. కాగా, పాన్-ఆధార్ కార్డుల అనుసంధానానికి డిసెంబర్ 31, 2025 చివరి తేదీ అని, గడువులోగా లింక్ చేయని పాన్ కార్డులు పనిచేయవని ప్రభుత్వం మరోసారి గుర్తుచేసింది.



More Telugu News