Anand Mahindra: మన పాఠ్యపుస్తకాల్లో 'సిక్కిం సుందరి' ఎందుకు లేదు? ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్

Anand Mahindra on why Sikkim Sundari is not in textbooks
  • ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న 'సిక్కిం సుందరి' మొక్క
  • హిమాలయాల్లో 4,800 మీటర్ల ఎత్తులో పెరిగే అరుదైన పుష్పం
  • జీవితంలో ఒక్కసారే పూసి మరణించే ప్రత్యేక లక్షణం
  • దీని గురించి పాఠ్యపుస్తకాల్లో ఎందుకు చేర్చలేదని మహీంద్రా ప్రశ్న
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహీంద్రా పోస్ట్
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటారు. స్ఫూర్తిదాయక, ఆసక్తికర విషయాలను పంచుకుంటూ నెటిజన్లను ఆకట్టుకుంటారు. తాజాగా ఆయన హిమాలయాల్లో పెరిగే ఒక అరుదైన మొక్క గురించి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. 'సిక్కిం సుందరి'గా పిలిచే ఈ మొక్క ప్రత్యేకతలు, దాని గురించి మన పాఠ్యపుస్తకాల్లో ఎందుకు ప్రస్తావించలేదంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

"ఈ అసాధారణమైన అద్భుతం గురించి నాకు ఇప్పటివరకు ఏమీ తెలియదు. దీని పేరు 'సిక్కిం సుందరి'. హిమాలయాల్లో 4,000 నుంచి 4,800 మీటర్ల ఎత్తులో పర్వతాల మధ్య ఒక ప్రకాశవంతమైన స్తంభంలా నిలబడి ఉంటుంది. దీని జీవితం సహనానికి ఒక గొప్ప పాఠం లాంటిది" అని మహీంద్రా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. "ఈ మొక్క 7 నుంచి 30 ఏళ్ల పాటు చిన్న ఆకుల గుత్తిగా ఉండి శక్తిని నిల్వ చేసుకుంటుంది. ఆ తర్వాత తన జీవితంలో ఒక్కసారి మాత్రమే రెండు మీటర్ల ఎత్తు వరకు పెరిగి, పూలు పూసి, విత్తనాలను విడుదల చేసి మరణిస్తుంది. ఇది ఒక కావ్యం లాంటిది. కానీ, ప్రపంచంలోని వృక్షజాలం గురించి చెప్పిన మా పాఠ్యపుస్తకాల్లో దీని ప్రస్తావన ఎక్కడా లేదు. ఇప్పటి పాఠ్య ప్రణాళికలోనైనా ఈ స్థానిక అద్భుతాన్ని చేర్చారా?" అని ఆయన ప్రశ్నించారు. సిక్కిం అందాలను చూడటానికి ఇది మరో కారణం అని ఆయన వ్యాఖ్యానించారు.

'సిక్కిం సుందరి' శాస్త్రీయ నామం 'రూమ్ నోబైల్' (Rheum nobile). దీనిని 'గ్లాస్‌హౌస్ ప్లాంట్' అని కూడా పిలుస్తారు. ఈ మొక్క తన చుట్టూ పారదర్శకమైన పొరలను (bracts) ఏర్పరుచుకుంటుంది. ఇవి ఒక సహజమైన గ్రీన్‌హౌస్‌లా పనిచేస్తాయి. తీవ్రమైన చలి నుంచి కాపాడటమే కాకుండా, సూర్యుడి నుంచి వచ్చే వేడిని ఒడిసిపట్టి, హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తాయి. ఈ నిర్మాణం పరాగసంపర్కానికి అవసరమైన కీటకాలను కూడా ఆకర్షిస్తుంది. జూలై-ఆగస్టు నెలల్లో ఇది పుష్పిస్తుంది.
Anand Mahindra
Sikkim Sundari
Rheum nobile
Himalayan plants
Glasshouse plant
Indian flora
Sikkim tourism
Rare plants
Plant adaptations
High altitude plants

More Telugu News