Chandrababu Naidu: రేపు సీఎం చంద్రబాబు 'క్వాంటం టాక్'... 50 వేల మంది టెక్ విద్యార్థులను ఉద్దేశించి కీలక ప్రసంగం

Chandrababu Naidu Quantum Talk to Focus on AP Quantum Tech Future
  • రేపు టెక్ విద్యార్థులతో మాట్లాడనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
  • క్వాంటం ప్రోగ్రామ్‌కు 50 వేల మందికి పైగా రిజిస్ట్రేషన్లు
  • నమోదు చేసుకున్నవారిలో 51 శాతం మంది అమ్మాయిలే!
  • ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఐబీఎం, టీసీఎస్‌లో ఇంటర్న్‌షిప్
  • అమరావతిని క్వాంటం టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం
క్వాంటం టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 'క్వాంటం టాక్' పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (డిసెంబరు 23) ఉదయం 9:30 గంటలకు టెక్ విద్యార్థులను ఉద్దేశించి డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు. క్వాంటం ఐటీ కంపెనీలైన క్యూబిట్, వైసర్‌లతో కలిసి ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది.

ఈ క్వాంటం ప్రోగ్రామ్ కోసం కేవలం 10 రోజుల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మందికి పైగా టెక్ విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 51 శాతం మంది మహిళా విద్యార్థులే ఉండటం విశేషం. అమరావతిని క్వాంటం టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దడంతో పాటు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను సిద్ధం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. తన ప్రసంగంలో సీఎం చంద్రబాబు ఏపీలో క్వాంటం టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాలిక రోడ్‌మ్యాప్‌ను వివరించనున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 3 వేల మందికి ఉన్నత స్థాయి శిక్షణ ఇవ్వనున్నారు. వీరి నుంచి ఎంపిక చేసిన 100 మంది విద్యార్థులకు ఐబీఎం, టీసీఎస్ వంటి ప్రముఖ కంపెనీలతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సీఎస్ఐఆర్, సీడాక్, నేషనల్ క్వాంటం మిషన్‌లలో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తారు. నేషనల్ క్వాంటం మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా, రాబోయే మూడేళ్లలో ఏపీ నుంచి లక్ష మంది క్వాంటం నిపుణులను తయారు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కార్యక్రమంలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి అభయ్ కరాండికర్, ఐఐటీ చెన్నై డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి, వైసర్ డైరెక్టర్ ప్రాచీ వఖారియా వంటి ప్రముఖులు పాల్గొననున్నారు.
Chandrababu Naidu
Quantum Technology
Andhra Pradesh
AP Government
Tech Students
Quantum Computing
Qubit
Wyser
Amaravati
National Quantum Mission

More Telugu News