Mohammad Motaleb Shikder: బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న హింస... మరో విద్యార్థి నేతపై కాల్పులు

Mohammad Motaleb Shikder Shot in Bangladesh Violence Continues
  • ఎన్‌సీపీ నేత మహమ్మద్ షిక్దర్‌ తలపై కాల్పులు
  • ఉస్మాన్ హాదీ హత్య తర్వాత పెరిగిపోయిన హింసాత్మక ఘటనలు
  • ఫిబ్రవరి 2026 ఎన్నికల ముందు దేశంలో పెరుగుతున్న ఉద్రిక్తత
బంగ్లాదేశ్‌లో హింసాకాండ కొనసాగుతూనే ఉంది. ప్రముఖ విద్యార్థి నేత ఉస్మాన్ హాదీ హత్యోదంతం మరిచిపోక ముందే, అదే పార్టీకి చెందిన మరో నాయకుడిపై హత్యాయత్నం జరిగింది. సోమవారం ఉదయం ఖుల్నా నగరంలో నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్‌సీపీ) నేత మహమ్మద్ మొతాలెబ్ షిక్దర్‌పై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఉదయం 11:45 గంటల సమయంలో దుండగులు షిక్దర్‌ను లక్ష్యంగా చేసుకుని కాల్చడంతో బుల్లెట్ ఆయన తలలోకి దూసుకెళ్లింది. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని, చికిత్స అందిస్తున్నామని దర్యాప్తు అధికారి అనిమేష్ మోండల్ తెలిపారు. ఘటనపై విచారణ ప్రారంభించినట్లు వెల్లడించారు.

గతవారం డిసెంబర్ 12న ఢాకాలో ఎన్‌సీపీకే చెందిన ప్రముఖ నేత షరీఫ్ ఉస్మాన్ హాదీని ముసుగులు ధరించిన దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. భారత వ్యతిరేక వ్యాఖ్యలతో గుర్తింపు పొందిన హాదీ, మాజీ ప్రధాని షేక్ హసీనాను గద్దె దించడానికి కారణమైన విద్యార్థి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన మరణం తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు, హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ముఖ్యంగా మైనారిటీలపై దాడులు పెరిగాయి.

గతేడాది జరిగిన భారీ విద్యార్థి నిరసనల నుంచి ఎన్‌సీపీ ఆవిర్భవించింది. 2026 ఫిబ్రవరిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీ పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలో వరుసగా విద్యార్థి నేతలపై జరుగుతున్న దాడులు దేశంలో తీవ్ర రాజకీయ అస్థిరతకు, ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.
Mohammad Motaleb Shikder
Bangladesh
Khulna
National Citizen Party
NCP
Sharif Usman Hadi
Student Leader
Political Violence
Sheikh Hasina
Bangladesh Election 2026

More Telugu News