ఏడో తరగతి బాలికపై నెలల తరబడి అత్యాచారం.. గురుగ్రామ్ లో బిడ్డకు జన్మనిచ్చిన బాలిక

  • చంపేస్తానని బెదిరించడంతో నిందితుడి అకృత్యాన్ని మౌనంగా భరించిన బాలిక
  • పురుటి నొప్పులు వచ్చే వరకూ గర్భందాల్చిన విషయమే గుర్తించని వైనం
  • నిందితుడిని అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు
గురుగ్రామ్ లో దారుణం చోటుచేసుకుంది. ఏడో తరగతి చదువుతున్న బాలికపై 34 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను బెదిరిస్తూ నెలల తరబడి ఈ దారుణం కొనసాగించాడు. ఫలితంగా బాలిక గర్భందాల్చింది. అయితే, పురుటినొప్పులు వచ్చే వరకూ తాను గర్భందాల్చిన విషయమే ఆ బాలికకు తెలియలేదు. తాజాగా బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న రాజేశ్ బాలిక ఇంటికి సమీపంలో అద్దెకుండేవాడు. బాలికపై గతేడాది డిసెంబర్ నుంచి నిందితుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాలిక భయపడి మౌనంగా ఉండిపోయింది. మరోపక్క, బాలిక గర్భం దాల్చే అవకాశం ఉందనే ఆలోచన రావడంతో రాజేశ్ తన గది ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

ఇక నెలల తరబడి జరిగిన అత్యాచారం కారణంగా బాలిక గర్భం దాల్చింది. అయినా ఆ విషయం బాలిక గుర్తించలేకపోయింది. ఇటీవల కడుపు నొప్పితో బాధపడుతున్న బాలికను ఆసుపత్రికి తీసుకు వెళ్లగా అసలు విషయం బయటపడింది. బాలిక గర్భవతి అని, పురుటినొప్పులు వస్తున్నాయని గుర్తించిన వైద్యులు డెలివరీ చేశారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితుడు రాజేశ్ ని అరెస్టు చేశారు.


More Telugu News