ఆ రోజే క్రికెట్ నుంచి శాశ్వ‌తంగా వైదొల‌గాల‌నుకున్నా.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రోహిత్ శ‌ర్మ‌

  • 2023 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్ లో ప‌రాజ‌యం త‌నను తీవ్రంగా కుంగ‌దీసింద‌న్న రోహిత్‌
  • ఈ ఓట‌మి త‌ర్వాత పూర్తిగా క్రికెట్ నుంచి త‌ప్పుకోవాల‌నుకున్న‌ట్లు వెల్ల‌డి
  • కానీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ మైదానంలో అడుగుపెట్టి టీ20 ప్ర‌పంచ క‌ప్ గెలిచామ‌న్న హిట్‌మ్యాన్  
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ నిన్న జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో త‌న రిటైర్మెంట్‌పై షాకింగ్ విష‌యం చెప్పాడు. 2023 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్ లో ఆస్ట్రేలియా చేతిలో ప‌రాజ‌యం త‌ర్వాత తాను పూర్తిగా క్రికెట్ నుంచి వైదొల‌గాల‌ని అనుకున్న‌ట్లు తెలిపాడు. ఈ ఓట‌మి త‌న‌ను తీవ్రంగా కుంగ‌దీసిన‌ట్లు హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. ఇక‌, త‌న‌వ‌ద్ద ఆడ‌టానికి ఆట ఏమీ మిగ‌ల‌లేద‌ని, పూర్తిగా త‌ప్పుకోవ‌డం బెట‌ర్ అని అనుకున్న‌ట్లు చెప్పుకొచ్చాడు. అయితే, ఈ పరాభ‌వం నుంచి కోలుకోవ‌డానికి కొంత స‌మ‌యం ప‌ట్టిన‌ట్లు తెలిపాడు. ఆ త‌ర్వాత ఆ సంక్లిష్ట‌ స‌మ‌యాన్ని దాటి  మ‌ళ్లీ ఆడ‌టం ప్రారంభించాన‌ని, 2024లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచామ‌ని తెలిపాడు.  

"2023 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత నేను పూర్తిగా దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. అందరూ చాలా నిరాశ చెందారు. ఏమి జరిగిందో మేము నమ్మలేకపోయాము. ఇది నాకు వ్యక్తిగతంగా చాలా కష్టమైన సమయం. ఎందుకంటే నేను ఆ ప్రపంచ కప్ కోసం రెండు లేదా మూడు నెలల ముందు నుంచి కాదు ఏకంగా 2022లో నేను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాను. కానీ, టోర్నీ ఆసాంతం బాగా ఆడి, ఫైన‌ల్లో ఊహించ‌ని ఓట‌మి న‌న్ను కుంగ‌దీసింది. దాంతో ఈ క్రీడ నా నుంచి ప్రతిదీ తీసివేసింద‌నే భావ‌న క‌లిగింది. దాంతో నేను ఇకపై ఆడకూడదనుకున్నాను. ఈ భావ‌న నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి కొంత సమయం పట్టింది. నెమ్మదిగా నేను తిరిగి నా మార్గాన్ని, శక్తిని తిరిగి పొందాను. మైదానంలో మళ్లీ దిగాను" అని రోహిత్ మాస్టర్స్ యూనియన్ ఈవెంట్ సందర్భంగా అన్నాడు.

ఇక‌, ఈ ఏడాది ప్రారంభంలో టీ20లు, టెస్ట్‌ల నుంచి హిట్‌మ్యాన్‌ రిటైర్ అయిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం రోహిత్ 50 ఓవర్ల ఫార్మాట్‌లో మాత్ర‌మే ఆడుతున్నాడు. 2027 వ‌న్డే ప్రపంచ కప్‌లో ప్రాతినిధ్యం వ‌హించాల‌ని చూస్తున్నాడు. ఇందులో భార‌త్‌కు వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిపించి తన కెరీర్‌ను విజ‌యంతో ముగించాలనుకుంటున్నాడు.


More Telugu News