ఎన్నికల్లో ఓడించారని రోడ్డు మూసేసిన సర్పంచ్ అభ్యర్థి.. పోలీసులపైనే దాడి.. వీడియో ఇదిగో!

  • నా భార్యకు ఓటేయని వాళ్లు నేను వేసిన రోడ్డుపై నడవొద్దని వార్నింగ్
  • రోడ్డుకు అడ్డంగా ఎడ్లబండి నిలిపి హల్ చల్
  • గ్రామస్తుల సమాచారంతో అక్కడికి వచ్చిన పోలీసులపై దాడి
  • ఆదిలాబాద్ జిల్లా చిన్నబుగ్గారంలో తీవ్ర ఉద్రిక్తత
సర్పంచ్ ఎన్నికల్లో తన భార్యను ఓడించిన గ్రామస్తులపై ఓ వ్యక్తి కక్షగట్టాడు. గతంలో సర్పంచ్ గా ఉన్నప్పుడు తాను వేసిన రోడ్డుపై నడవొద్దని వార్నింగ్ ఇచ్చాడు. రోడ్డుకు అడ్డంగా ఎడ్లబండి నిలిపి జనం రాకపోకలను అడ్డుకున్నాడు. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకుని ఎడ్లబండి తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో ఓడిన అభ్యర్థి, మద్దతుదారులతో కలిసి ఏకంగా పోలీసులపైనే దాడి చేశాడు. ఆదిలాబాద్ జిల్లాలోని చిన్నబుగ్గారం గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నేరడిగొండ మండలం చిన్న బుగ్గారంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓ మహిళా అభ్యర్థి ఓడిపోయారు. ఈ ఓటమిని తట్టుకోలేక ఆమె భర్త రాథోడ్ మోహన్ తమ ఇంటి ముందున్న రోడ్డుకు అడ్డంగా ఎడ్ల బండిని నిలిపాడు. తన భార్యకు ఓటు వేయనివాళ్లు ఆ రోడ్డుపై నుంచి వెళ్లవద్దని హెచ్చరించాడు. గ్రామస్తుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆ ఎడ్లబండిని తొలగించేందుకు ప్రయత్నించారు.

రాథోడ్ మద్దతుదారులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, రాథోడ్ మద్దతుదారులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులపై రాథోడ్ వర్గీయులు రాళ్లతో దాడి చేయడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రాథోడ్ మద్దతుదారుల దాడిలో ఎస్ఐ సయ్యద్ ఇమ్రాన్ తో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో రాథోడ్, ఆయన కుటుంబ సభ్యులతోపాటు మద్దతుదారులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


More Telugu News