Hyderabad Doctor Cyber Fraud: రూ. 14.61 కోట్ల సైబర్ మోసం... నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు!

Hyderabad Doctor Loses 14 Crores in Cyber Fraud
  • సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన హైదరాబాద్ వైద్యుడు 
  • సైబర్ క్రిమినల్స్‌కు మ్యూల్ బ్యాంక్ ఖాతాలు సమకూర్చిన నిందితులు 
  • నిందితుల కస్టడీ కోరుతూ కోర్టులో పోలీసుల పిటిషన్
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన భారీ సైబర్ మోసం కేసులో కీలక ముందడుగు పడింది. నకిలీ పెట్టుబడుల పేరుతో ఓ వైద్యుడి నుంచి ఏకంగా రూ.14.61 కోట్లు కొల్లగొట్టిన ఘటనలో నలుగురు నిందితులను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర చరిత్రలో ఒకే వ్యక్తి ఇంత భారీ మొత్తంలో మోసపోవడం ఇదే మొదటిసారి కావడంతో ఈ కేసు దర్యాప్తును అధికారులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించి ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన బ్రహ్మినాయుడు, పవన్, మణిరామ్, శివకృష్ణను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సైబర్ నేరగాళ్లకు వీరంతా మ్యూల్ బ్యాంక్ ఖాతాలు సమకూర్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వైద్యుడి నుంచి కాజేసిన డబ్బును ఈ ఖాతాల ద్వారానే ప్రధాన నిందితులు బదిలీ చేసుకున్నట్లు గుర్తించారు.

అరెస్ట్ చేసిన నలుగురు నిందితులను మరింత లోతుగా విచారించేందుకు ఐదు రోజుల కస్టడీకి అనుమతించాలని కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించనుంది. నిందితుల విచారణ ద్వారా ఈ సైబర్ మోసం వెనుక ఉన్న ప్రధాన సూత్రధారుల గుట్టు రట్టు చేయవచ్చని సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు.
Hyderabad Doctor Cyber Fraud
Cyber Fraud
Cyber Crime
Telangana Cyber Security Bureau
Mule Bank Accounts
Online Investment Fraud
Financial Cybercrime
Nampally Court
Cyber Security

More Telugu News