Supreme Court: సంసారంలోని కీచులాటలు క్రూరత్వం కిందికి రావు: సుప్రీంకోర్టు

Supreme Court Clarifies Domestic Disputes Not Always Cruelty
  • భర్త డబ్బుకు లెక్కలడగడం క్రూరత్వం కాదన్న సుప్రీంకోర్టు
  • ఎన్నారై భర్త, అతడి కుటుంబంపై భార్య పెట్టిన గృహ హింస కేసు కొట్టివేత
  • సంసారంలో జరిగే సాధారణ గొడవలను 498A కింద చూడలేమన్న ధర్మాసనం
భార్యకు డబ్బులిచ్చి, ఆపై ఆ డబ్బుకు లెక్కలు అడగడం క్రూరత్వం కిందకు రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓ ఎన్నారై సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, అతడి కుటుంబ సభ్యులపై భార్య పెట్టిన గృహ హింస కేసును కొట్టివేస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. సంసారంలో జరిగే సాధారణ గొడవలను, కీచులాటలను ఐపీసీ సెక్షన్ 498A కింద నేరంగా పరిగణించలేమని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది.

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న దంపతులకు 2016లో వివాహమైంది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. 2019లో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో భార్య తన కొడుకుతో కలిసి హైదరాబాద్‌లోని పుట్టింటికి తిరిగి వచ్చారు. దాంపత్య హక్కుల పునరుద్ధరణ కోసం భర్త 2022లో నోటీసులు పంపగా, ఆ వెంటనే భార్య హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీసు స్టేషన్‌లో భర్త, అతడి కుటుంబంపై గృహ హింస, వరకట్న వేధింపుల కింద ఫిర్యాదు చేశారు.

కుటుంబ ఖర్చుల కోసం డబ్బిచ్చిన ప్రతీసారీ భర్త లెక్కలు అడుగుతున్నారని, తనను, బిడ్డను ఆర్థికంగా పట్టించుకోకుండా ఇండియాలోని తన తల్లిదండ్రులకు మాత్రం లక్షల్లో డబ్బు పంపుతున్నారని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు. గర్భవతిగా ఉన్నప్పుడు సరిగా చూసుకోలేదని, ప్రసవం తర్వాత బరువు తగ్గాలని వేధించారని కూడా ఆమె పేర్కొన్నారు.

ఈ ఆరోపణలను పరిశీలించిన ధర్మాసనం ఇవి సంసారంలో జరిగే సాధారణ వివాదాలు మాత్రమేనని అభిప్రాయపడింది. భర్త తన తల్లిదండ్రులకు డబ్బు పంపడాన్ని తప్పుబట్టలేమని, ఖర్చులకు లెక్కలడగడాన్ని క్రూరత్వంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. బరువు తగ్గమని చెప్పడం వంటివి వ్యక్తిగత గుణాన్ని సూచిస్తాయి తప్ప, సెక్షన్ 498A కింద నేరం కాదని పేర్కొంది. ఈ కేసులో తొలుత తెలంగాణ హైకోర్టు భర్త పిటిషన్‌ను తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భార్య చేసిన ఆరోపణలు నిరాధారంగా ఉన్నాయని పేర్కొంటూ సర్వోన్నత న్యాయస్థానం ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసింది.
Supreme Court
domestic violence
IPC 498A
marital dispute
cruelty
dowry harassment
NRI
software engineer
family dispute
financial dispute

More Telugu News