చలి పంజాకు విలవిల్లాడుతున్న తెలంగాణ

  • రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
  • సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 4.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు
  • ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ 5 డిగ్రీల సమీపంలో ఉష్ణోగ్రతలు
  • ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత అధికం
  • అనేక ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైన ఉష్ణోగ్రత
తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలు జిల్లాలు చలి పులి పంజాకు చిక్కి విలవిలలాడుతున్నాయి. శనివారం ఉదయం సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలంలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 4.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యంత తక్కువ ఉష్ణోగ్రత కావడం గమనార్హం. గత పదిహేను రోజులుగా ఈ ప్రాంతంలో చలి తీవ్రత అధికంగా ఉంది.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సిర్పూర్‌(యు) మండలంలో 4.8 డిగ్రీలు, తిర్యాణి మండలం గిన్నెధరిలో 5.1 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం అర్లి(టి)లో 5.9 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని సుమారు 60 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి.

ఇక నిజామాబాద్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోనూ చలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో 8.2 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా గాంధారిలో 7.4 డిగ్రీలు, నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి సమీపంలో 8.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


More Telugu News