గుడ్లతో క్యాన్సర్ వస్తుందా?.. ఎఫ్ఎస్ఎస్ఏఐ క్లారిటీ!

  • దేశంలో విక్రయించే గుడ్లు పూర్తిగా సురక్షితమన్న ఎఫ్ఎస్ఎస్ఏఐ
  • గుడ్ల వల్ల క్యాన్సర్ వస్తుందన్నది అవాస్తవమని స్పష్టీకరణ
  • పుకార్లను నమ్మవద్దని ప్రజలకు సూచన
దేశంలో లభించే గుడ్లు తినడం ఆరోగ్యానికి సురక్షితమని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) స్పష్టం చేసింది. గుడ్ల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంటూ ఇటీవల సోషల్ మీడియాలో, కొన్ని నివేదికల్లో వస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. ఇవి శాస్త్రీయంగా నిరాధారమైనవని, ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు సృష్టించేలా ఉన్నాయని తెలిపింది.

ప్రముఖ కంపెనీకి చెందిన గుడ్లలో నైట్రోఫ్యూరాన్ అనే నిషేధిత యాంటీబయాటిక్ అవశేషాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో ఈ వివాదం మొదలైంది. దీనిపై స్పందించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్, 2011 ప్రకారం.. పౌల్ట్రీ, గుడ్ల ఉత్పత్తిలో ఏ దశలోనూ నైట్రోఫ్యూరాన్‌ల వాడకాన్ని కఠినంగా నిషేధించినట్లు తెలిపింది.

నైట్రోఫ్యూరాన్ అవశేషాల కోసం నిర్దేశించిన 1.0 µg/kg పరిమితి (EMRL) కేవలం నియంత్రణ, అమలు ప్రయోజనాల కోసమేనని అధికారులు వివరించారు. అత్యాధునిక ల్యాబ్‌లలో గుర్తించగలిగే కనీస స్థాయి ఇది. అంతేకానీ, ఈ పదార్థాన్ని వాడటానికి అనుమతి ఉందని దీని అర్థం కాదని తేల్చిచెప్పారు. ఈ పరిమితి కంటే తక్కువ స్థాయిలో అవశేషాలు కనుగొనబడితే, అది ఆహార భద్రతా ఉల్లంఘన కిందకు రాదని, దానివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదని ఓ అధికారి తెలిపారు.

భారత నియంత్రణ వ్యవస్థ అంతర్జాతీయ పద్ధతులకు అనుగుణంగానే ఉందని ఎఫ్ఎస్ఎస్ఏఐ నొక్కి చెప్పింది. యూరోపియన్ యూనియన్, అమెరికాలో కూడా ఆహారాన్ని ఉత్పత్తి చేసే జంతువులపై నైట్రోఫ్యూరాన్‌ల వాడకాన్ని నిషేధించారు. ఏ జాతీయ లేదా అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ కూడా సాధారణంగా గుడ్లు తినడాన్ని క్యాన్సర్ ప్రమాదంతో ముడిపెట్టలేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది. కాబట్టి, ధ్రువీకరించిన శాస్త్రీయ ఆధారాలను, అధికారిక సలహాలను మాత్రమే ప్రజలు విశ్వసించాలని కోరింది. 


More Telugu News